ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని.. తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలగానే ఉంటామన్నారు కమలానంద భారతి. నాడు అనే పదం తమిళం కాదా.. ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా.. ఆంధ్ర, ప్రదేశ్ రెండే సంస్కృత పదాలే అంటూ వివరణ ఇచ్చారు. అడిగేవారు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారని.. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిదికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.'రామాయణ కాలం నుంచి ఆంధ్రా పేరు ఉంది. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు. ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు.. కానీ పార్టీ పేరు మాత్రం తెలుగుదేశం అని పెట్టారు. ఇలాంటి మేధావులు ఏపీకి మద్రాస్ రాకుండా చేశారు.. మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. గరికపాటి ఆంధ్రాకు రారు.. తెలంగాణలో సెటిలయ్యారు.. ఎక్కడో ఉండే గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దు. మేం ఆంధ్రప్రదేశ్ ప్రజలగానే ఉంటాం' అన్నారు కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్‌ పేరును తెలుగునాడుగా మార్చాలంటూ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నారని.. ఏపీ పేరును ఎందుకు మార్చరని ప్రశ్నించారు. తెలుగునాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయమని.. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదన్నారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఎలాగో.. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అన్నారు. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు మారతాయన్నారు. లేదన్నారు. ఇది తమిళనాడు తరహాలో తెలుగు భాషా గర్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుందన్నారు. 'తమిళనాడు మాదిరిగా ఏపీని ‘తెలుగునాడు’గా మార్చాలి. కేరళ ప్రజలు కేవలం ఒక్క సున్నా లేదని పేరు మార్చాలని పట్టుబట్టారు. . కేరళ వాళ్లకున్న పట్టుదల మనలో ఉంటే తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి' అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహా సభలలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు మీడియం మాత్రమే కొనసాగించాలని.. అలా చేస్తేనే తెలుగు భాష నిలబడుతుందన్నారు గరికపాటి. ఈ వ్యాఖ్యలకు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి కౌంటరిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.