Electric Scooter Sales: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరిగింది. గతేడాది చివరి వరకు స్టార్టప్ కంపెనీలు ఇ-స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తే ఇప్పుడు సంప్రదాయ టూ-వీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టి వాటిని వెనక్కి నెట్టేశాయి. గతేడాది వరకు అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓలా స్కూటర్లకు గిరాకీ క్రమంగా పడిపోతోంది. టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు అడుగు పెట్టడంతో అంతా తారుమారైంది. 2026, ఫిబ్రవరి నెలలో టీవీఎస్, బజాజ్ వంటి సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలు తమ సత్తా చాటాయి. అత్యధిక విక్రయాలతో టాప్ లేపాయి. ఒకప్పుడు ఈవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన మార్కెట్ వాటాను భారీగా కోల్పోయింది. దీంతో టాప్-5లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. ఫిబ్రవరి మొత్తంలో 1,11,680 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు విక్రయమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈసారి 46 శాతం వృద్ధి నమోదైంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ ఫిబ్రవరి నెలలో 31,600 యూనిట్లు విక్రయించి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదిలో ఇదే సమయం విక్రయాలతో పోలిస్తే 67 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆ తర్వాత మరో టూ-వీలర్ కంపెనీ బజాజ్ ఆటో 25,323 యూనిట్లు విక్రయించి ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ చేతక్ స్కూటర్లు విక్రయిస్తోంది. గతేడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక గత ఏడాదితో పోలిస్తే తమ విక్రయాలను 72 శాతం పెంచుకుని ఈసారి ఫిబ్రవరి 20,581 స్కూటర్లు విక్రయించింది. ఇక విడా బ్రాండ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొత్తం 12,512 వాహనాలు విక్రయించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో 364 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇక ఈ లిస్టులో గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంచనాలను మించి రాణించింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని వెనక్కి నెట్టి మొదటిసారి టాప్-5లో నిలిచింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల విక్రయాలతో పోలిస్తే ఈసారి 27 శాతం వృద్ధి సాధించి 4725 యూనిట్లను గ్రీవ్స్ సంస్థ విక్రయించింది. యాంపియర్ పేరుతో ఈ సంస్థ టూ-వీలర్స్ విక్రయిస్తోంది. అంటే ఫిబ్రవరి నెలలో ఓలా కంపెనీ ఆ మాత్రం విక్రయాలు సైతం నమోదు చేయలేదని తెలుస్తోంది. అగ్రస్థానం నుంచి అట్టడుగు స్థాయికి ఓలా పడిపోవడం గమనార్హం.