Investments: మేధావులు.. విభిన్నమైన పనులు చేయరు. వారు చేసే పనుల్నే విభిన్నంగా చేస్తారు. ఇదే విధంగా స్మార్ట్ ఇన్వెస్టర్ ఎవరైనా.. తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మిలియనీర్ లేదా బిలియనీర్ అవుతాడు. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపాదించుకోవాలనుకునే వారు.. పెద్ద మొత్తం కూడబెట్టాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా లాంగ్ రన్‌లో పెద్ద మొత్తంలో సమకూరుతుందని చెప్పొచ్చు. అయితే.. ఇక్కడ తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. అంటే చాలా చిన్న వయసులోనే చేరడం. అప్పుడే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. ఇంకా.. స్టెప్ అప్ చేయడం. అంటే.. మ్యూచువల్ ఫండ్లలో అన్నేళ్లు ఒకే మొత్తం కాకుండా.. డబుల్ ప్రాఫిట్స్ పొందే వీలుంటుంది. కాంపౌండింగ్ ఇందుకు వీలు కల్పస్తుంది. ఇప్పుడు దీర్ఘకాలంలో మనం కోటీశ్వరులు కావాలంటే.. చాలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేసినా.. ఎలా సంపద సమకూరుతుందో తెలుసుకుందాం. సాధారణంగా చాలా వరకు ఈక్విటీ సగటున 15 శాతం వరకు రాబడి అందిస్తుంటాయి. అంతకంటే ఎక్కువ ఇచ్చేవి కూడా ఉంటాయి. కానీ మనం సగటున 15 శాతానికి లెక్కిద్దాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. చిన్న వయసులో అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు చేస్తూ ఇన్వెస్ట్ చేస్తుండటం ముఖ్యం. ఇక్కడ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. సంపాదించే దాంట్లో నుంచి కొన్ని అనవసర ఖర్చుల్ని తగ్గించుకొని డబ్బును ఆదా చేస్తుండాలి. దానిని మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నెలకు రూ. 9 వేల సిప్ లేదా రోజుకు రూ. 300 చొప్పున ఆదా చేస్తూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో చేతికి కోట్లు వస్తాయి. వార్షిక ప్రాతిపదికన సిప్ మొత్తాన్ని 15 శాతం చొప్పున పెంచుతూ పోతే.. రాబడి ఇంకా ఎక్కువ వస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెలనెలా ఇంత ఆదా చేస్తే చాలు..నెలకు రూ. 9 వేల చొప్పున సిప్ ప్రారంభించి.. 15 శాతం అంచనా రాబడితో చూస్తే.. స్టెప్ అప్ సిప్ 15 శాతంగా (ఏటా 15 శాతం సిప్ మొత్తాన్ని పెంచడం) అనుకుంటే.. అప్పుడు సుమారు 35 ఏళ్లలో రూ. 55.88 కోట్లు సంపాదించొచ్చని ఎస్బీఐ సెక్యూరిటీస్ మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ చెబుతోంది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు జీవించేందుకు.. మీతో పాటు మీ కుటుంబానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే కచ్చితంగా ఇంతే పెట్టుబడి పెట్టాలన్నది ఏం లేదు. నెలకు కనీసం రూ. 100 నుంచి కూడా సిప్ పెట్టుబడి ప్రారంభించొచ్చు. రూ. 1000, రూ. 2 వేలు, రూ. 5 వేలు ఇలా ఎంత ఇన్వెస్ట్ చేస్తూ పోయినా.. దానికి తగ్గట్లుగానే రాబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టి ఓపికతో ఎదురుచూడటం ముఖ్యం. ఇదే విధంగా అదే రూ. 9 వేల సిప్ చేస్తూ.. 15 శాతం అంచనా రాబడితో.. స్టెప్ అప్ సిప్ 10 శాతంగా వేసుకుంటే మొత్తం 35 ఏళ్లలో రూ. 30.16 కోట్లు వస్తాయి. ఇంకా 15 శాతం స్టెప్ అప్ సిప్ చేస్తూ.. 12 శాతం అంచనా రాబడి అనుకున్నా ఇక్కడ రూ. 33.75 కోట్లు సమకూరుతాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే.. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. ఏదో ఇన్వెస్ట్ చేశాం కదా అని వెంటనే వస్తాయని 2-3 ఏళ్లలో డబ్బులు విత్‌‌డ్రా చేయకూడదు. ఓపికతో ఎదురుచూడాలి. నిలకడగా ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. నెలకు సిప్ మొత్తం ఒకేసారి అంటే కుదరకపోవచ్చు. వృథా ఖర్చుల్ని నివారించేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదా రోజూ కొంత చొప్పున పక్కనబెట్టి నెలలో ఒకేసారి కట్టేయొచ్చు. గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. పైన ఇచ్చింది అంచనా లెక్కలు మాత్రమే. వాస్తవంగా కచ్చితంగా అంతే రిటర్న్స్ రాావాలని లేదు.