తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం ఏడు కులాల యాజమాన్యంలోనే ఉందని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్యానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమి 1.37 కోట్ల ఎకరాలు కాగా.. సగానికి పైగా రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది. అంటే జనాభా నిష్పత్తి కన్నా భూ యాజమాన్యం వీరి వద్దే అధికంగా ఉంది.ఓసీ విభాగంలోని రెడ్డి కులం భూ యాజమాన్యంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఈ కులం వాటా కేవలం 4.8 శాతం కాగా.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 13.5 శాతం భూమి వీరి యాజమాన్యంలోనే ఉంది. వీరితో పాటు మరో 25 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండగా.. మిగిలిన అనేక కులాలు జనాభా కంటే తక్కువ భూమితో సరిపెట్టుకుంటున్నాయి. రెడ్డి కులం తర్వాత 5.7 శాతం ఉన్న యాదవ కులం వారి వద్ద 8.7 శాతం భూమి ఉంది. ఎస్టీ లంబాడా జనాభా 6.8 కాగా.. భూమి 8.6 ఉంది. ముదిరాజ్ జనాభా 7.4 శాతం కాగా.. భూమి 7.8 శాతం కలిగి ఉంది. మున్నూరు కాపు 3.9 శాతం జనాభా ఉండగా.. భూమి 6.4 శాతం కలిగి ఉన్నారు. కురమ 2.2 శాతం జనాభా ఉండగా.. భూమి 3.6 శాతం ఉంది. కోయ 1.2 శాతం ఉండగా.. భూమి 2.8 శాతం కలిగి ఉన్నారు. ఇలా ఈ ఏడు కులాల మెుత్తం జనాభా 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది. బీసీ-బి కేటగిరీకి చెందిన కురుబ, కురుమ కులాల్లో భూమి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ కులాల్లో దాదాపు 62 శాతం కుటుంబాలకు సొంత భూమి ఉంది. వీరి తర్వాత ఆరేవాళ్లు, ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, ఎస్సీ విభాగంలో మాదాసి కులాల్లో దాదాపు 60 శాతం కుటుంబాలు భూ యాజమాన్యం కలిగి ఉన్నాయి. అయితే, ఓసీ విభాగంలోని రాజులు, బ్రాహ్మణులు, ముస్లింలు, జైన్లలో భూమి ఉన్న కుటుంబాల శాతం 10 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ మాదిగ 10.3 శాతం ఉండగా.. భూమి 6.5 శాతంగా ఉంది. ముస్లిం 7.9 శాతం జనాభా కాగా.. భూమి 2.0 శాతం ఉంది. ఓసీ వెలమ 0.4 శాతం జనాబా ఉండగా.. భూమి 1 శాతం ఉంది. పెద్ద కమతాలు (5-20 ఎకరాలు): ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది.చిన్న కమతాలు (5 ఎకరాల లోపు): ఎస్సీ బేడ, మాదిగ కులాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది.భారీ కమతాలు (20 ఎకరాల పైబడి): 20 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు అత్యధికంగా జైన్లలో (8.2 శాతం), రాజుల్లో (7.5 శాతం), బ్రాహ్మణుల్లో (6.8 శాతం), బీసీ గంగిరెడ్లవారిలో (6 శాతం) ఉన్నాయి.