వైఎస్ జగన్‌ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

Wait 5 sec.

వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో శ్రీహరి పోస్టులు పెట్టించారనే ఆరోపణలు వచ్చాయని తెలుస్తోంది. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్‌ పోస్టింగ్‌లు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో చిత్తూరు జిల్లాలో కేసు నమోదు చేశారు. ఇవాళ శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆయన దగ్గర నుంచి మొబైల్, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. పూడి శ్రీహరిని తాడేపల్లిలోని నివాసంలో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీపీఆర్‌వోగా పనిచేశారు.పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలసులు అరెస్ట్ చేసినట్లు వైఎస్సార్‌సీపీ తెలిపింది. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని శ్రీహరి ఇంటికి వచ్చి.. కనీసం కేసు ఏంటో కూడా చెప్పకుండా ఫోన్, ల్యాప్‌టాప్‌‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పూడి శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చిత్తూరు 2 టౌన్ సీఐ పూడి శ్రీహరిని దౌర్జన్యంగా తీసుకెళ్లారని.. ఈ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను అన్నారు. శ్రీహరి అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పూడి శ్రీహరి గతంలో పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో శ్రీహరి కీలకంగా వ్యవహరించారు. మీడియాకు సంబంధించిన వ్యవహారాలను శ్రీహరి చక్కదిద్దారు. అలాగే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రపై అడుగడుగునా అంతరంగం పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీపీఆర్‌వోగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత శ్రీహరికి వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించారు.. ప్రస్తుతం శ్రీహరి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పదవిలో ఉన్నారు.