ఐపీఎల్ 2026కు ముందు జరిగిన మినీ వేలంలో కోసం ఓ పెద్ద యుద్ధమే జరిగింది. గ్రీన్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. పర్స్‌లో ఎక్కువగా డబ్బులు ఉండటంతో గ్రీన్‌ను దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఉండటంతో ఆల్‌రౌండర్ కోటాలో కామెరూన్ గ్రీన్ రూ. 25.2 కోట్లకు పలికాడు. అయితే, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం ఈ సీజన్‌లో ఇవ్వలేకపోయాడు. పేపర్ మీద బలంగా ఉన్న కేకేఆర్ జట్టు ఈ సీజన్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండర్ కోటాలో చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. కానీ, గ్రౌండ్‌లో మాత్రం తేలిపోయింది. కేకేఆర్ ఓటముల్లో కామెరూన్ గ్రీన్ పాత్ర కూడా ఉండటం ఆ జట్టుకు మింగుడు పడటం లేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడితే ఒక్కదాంట్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విజయం లేకుండా ఉన్న కేకేఆర్.. చెపాక్ వేదికగా సీఎస్కేపై ఎలాగైనా గెలవాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే టాస్ కూడా అనుకూలించింది. కానీ, బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. నెంబర్ 3లో విఫలమవుతున్నాడన్న కారణంతో మిడిలార్డర్‌లో వచ్చినా సేమ్ సిచ్యుయేషన్. సీఎస్కేపై మ్యాచ్‌ని నిలబెట్టాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన గ్రీన్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గ్రీన్ వైఫల్యం చూసి కేకేఆర్ డగౌట్ తెల్లబోయింది. అభిషేక్ నాయర్, షేన్ వాట్సన్, బ్రావో అందరూ చేసేదేం లేక తలలు నేలకేశారు. ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఐదు మ్యాచ్‌లలోనూ గ్రీన్ బ్యాటింగ్‌ దిగాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేకేఆర్ 220 పరుగులు చేస్తే గ్రీన్ 10 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. సన్‌రైజర్స్ పై 2 (2), పంజాబ్ కింగ్స్‌పై 4 (2), లక్నో సూపర్ జెయింట్స్ పై 32 (24), సీఎస్కేపై 0 (1) చేశాడు. లక్నో మినహా మిగతా అన్నీ మ్యాచ్‌లలోనూ గ్రీన్ అవుటయ్యాడు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసినా లాభం లేకపోవడంతో ఆడించాలా? డగౌట్‌కి పరిమితం చేయాలా? అన్న డైలమాలో కేకేఆర్ మేనేజ్‌మెంట్ పడింది.