భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చారిత్రాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో పాటు, పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 550 ఉండగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆ సంఖ్యను 850కి పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో రాష్ట్రాల వాటా 815 కాగా.. కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలను కేటాయించనున్నారు. ఈ పునర్విభజన బిల్లు ప్రక్రియ వల్ల పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కొత్త లెక్కల ప్రకారం ఇవి 26 లేదా 27కు పెరిగే అవకాశముంది. అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా.. అదనంగా 60 సీట్లతో 179కి చేరే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనాభా పరంగా దేశంలోనే 17వ స్థానంలో ఉంది. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అదనంగా 3 నుంచి 4 ఏర్పడనున్నాయి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి స్థానాలను విభజించి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను విభజించి అదనంగా మరో రెండు స్థానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మెదక్, జహీరాబాద్‌లకు తోడు మరొక కొత్త స్థానం రానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ విభజన ద్వారా అదనంగా ఒక స్థానం ఏర్పడనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒకటి లేదా రెండు కొత్త స్థానాలు వచ్చే సూచనలున్నాయి.ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్‌సభలో ఇద్దరు మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. 2029 ఎన్నికల నాటికి ఈ సంఖ్య కనీసం 9కి చేరనుంది. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు తక్కువ టికెట్లు కేటాయించినప్పటికీ.. భవిష్యత్తులో ప్రతి పార్టీ కచ్చితంగా 9 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, ఈ పునర్విభజన ప్రక్రియ 2026-27 నాటి జనాభా లెక్కల ఆధారంగా జరిగే అవకాశం ఉందని.. అప్పటికి నియోజకవర్గాల సరిహద్దులు మారిపోయి సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులు మహిళల గొంతు పార్లమెంటులో మరింత బలంగా వినిపించడానికి దోహదపడతాయని అంటున్నారు.