ఏపీ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. అనూహ్యంగా చంద్రశేఖర్ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. తోట చంద్రశేఖర్ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయ్యారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్‌ను కలడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. తోట మళ్లీ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. తోట చంద్రశేఖర్‌ ఐఏఎస్ అధికారి.. మహారాష్ట్ర కేడర్‌‌లో పనిచేశారు. ఆయన 2008లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత ఆదిత్య హైజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. చంద్రశేఖర్ మెగా బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. అనంతరం చంద్రశేఖర్ వైఎస్సార్‌సీపీలో చేరి 2014 ఎన్నికల్లోఏలూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. చంద్రశేఖర్ మళ్లీ జనసేన పార్టీలో చేరి.. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తోట చంద్రశేఖర్ మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి చంద్రశేఖర్ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.. రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు మళ్లీ ఆయన పవన్ కళ్యాణ్‌ను కలవడతంతో జనసేన పార్టీలోకి వస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారా.. రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్‌ను వెళ్లి జనసేన పార్టీ కార్యాలయంలో కలవడంతోనే ఆయన జనసేన పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ మొదలైంది. ఈ రాజకీయ ఊహాగానాలపై తోట చంద్రశేఖర్ స్పందించాల్సి ఉంది.