'లడ్డూ ప్రసాదం' పేరుతో 'హెరిటేజ్ ఐస్‌క్రీమ్'..! వీడియోలు వైరల్, అసలేంటీ వివాదం?

Wait 5 sec.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార, విపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది.. నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరో వివాదం మొదలైంది.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి లింక్ పెడుతూ హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిలు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌‌.. పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్ తదితర ఉత్పత్తులను విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. హెరిటేజ్ సంస్థ నుంచి 'లడ్డూ ప్రసాదం' పేరుతో ఐస్‌క్రీమ్‌ను మార్కెట్‌‌లోకి తీసుకొచ్చారని. లడ్డూ ప్రసాదం ఫ్లేవర్ అని పేరు పెట్టి తిరుమల ప్రసాదాన్ని అవమానిస్తున్నారంటూ కొందరు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఎక్స్‌లో పోస్టులు చేశారు. 'నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు.. నేడు “లడ్డూ ప్రసాదం” పేరుతో వ్యాపారాలు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న హెరిటేజ్ కంపెనీ' అంటూ కొందరు ట్వీట్‌లు చేశారు. లడ్డూ ప్రసాదం పేరతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేస్తుందని ప్రశ్నించారు. హెరిటేజ్ బ్రాండ్‌ పేరుతో ఉన్న లడ్డూ ప్రసాదం ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.హెరిటేజ్ లడ్డూ ప్రసాదం పేరుతో ఐస్‌క్రీమ్ తయారు చేసిందని వైఎస్సార్సీపీ అనుకూల హ్యాండిల్స్ చేస్తున్న ప్రచారం పట్ల టీడీపీ అనుకూల హ్యాండిల్స్ స్పందించాయి. Fact Check Tdp పేరుతో ఉన్న ఓ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఈ అంశంపై స్పందించారు. లడ్డూ ప్రసాదం పేరుతో చెబుతున్న హెరిటేజ్ ఐస్‌క్రీమ్ అసలు లేదని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి పరమపవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారని.. దీని నుంచి ప్రజ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డం కోసం.. హెరిటేజ్‌లో అస‌లు ఆ పేరుతో ఏ ప్రోడ‌క్ట్ లేక‌పోయినా.. ఫేక్ ఫ్యాక్టరీలో ల‌డ్డూ ప్రసాదం పేరుతో ఒక ఐస్ క్రీం త‌యారుచేసి వ‌దిలారని ఆరోపించారు. రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం, తాను చేసిన పాపాలు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇంత‌లా దిగ‌జారాలా అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. హెరిటేజ్ ప‌రువు ప్రతిష్టల‌ను భంగం క‌లిగించేందుకు త‌ర‌చూ ఇలాంటి కుట్రలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.అలాగే ఈ లడ్డూ ప్రసాదం ఐస్‌క్రీమ్‌పై మరికొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లడ్డూ ప్రసాదం అన్నారు కానీ ఏ దేవుడి పేరు పెట్టలేదు కదా అని కొందరు టీడీపీ అభిమానుల వాదన.. వైఎస్సార్‌సీపీ అనుకూల హ్యాండిల్స్ మాత్రం లడ్డూ ప్రసాదం అని ఐస్‌క్రీమ్‌కు పేరు పెట్టడం తప్పని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ హెరిటేజ్ సంస్థ లడ్డూ ప్రసాదం పేరుతో ఐస్ క్రీమ్‌ను నిజంగానే తయారు చేసిందా? లేదంటే ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదంపై హెరిటేజ్ స్పందించి, క్లారిటీ ఇస్తే ఈ గందరగోళానికి తెరపడుతుందని కొందరు చెబుతున్నారు.