చెన్నై సూపర్ కింగ్స్‌లో పాత వైభవం మళ్లీ పుట్టుకొచ్చినట్టు కనిపించింది. ప్రత్యర్థి జట్టు వైపు ఉన్న మ్యాచ్‌ని ఒక్కసారిగా తమ వైపు తిప్పుకోవడంలో సీఎస్కే దిట్ట. ఐదు టైటిల్స్ గెలిచిన జట్టు గతంలో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లు గెలిచింది. రెండేళ్లు పాయింట్ట పట్టికలో అట్టడుగున పడి ఉన్న చెన్నై ఒక్కసారిగా పాత రోజులను మళ్లీ గుర్తు చేసింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ వైపు ఉన్న మ్యాచ్‌ని ఒక్కసారిగా సీఎస్కే తిప్పేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అందించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ రహానే నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ని తమవైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ఐదో ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగా.. 10వ ఓవర్ వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆఖరి ఓవర్లలో పరుగులు రాబట్టొచ్చు అన్న ప్లాన్ వేసినా కేకేఆర్ స్ట్రాటజీని పటాపంచలు చేసేశాడు. 11వ ఓవర్‌లో బంతి అందుకున్న నూర్.. కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతికి కెప్టెన్ రహానేను క్యాచ్ రూపంలో అవుట్ చేసిన నూర్ అహ్మద్.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఒక్కసారిగా మ్యాచ్‌ని సీఎస్కే వైపు తిప్పేశాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడిపోవడం.. మ్యాచ్‌ని గెలిపిస్తాడు అనుకున్న గ్రీన్ గోల్డెన్ డకౌట్ కావడంతో కేకేఆర్ ఆశలు గాలిలో కలిసిపోయాయి. డెత్ ఓవర్లలో డేంజరస్ బ్యాటర్ రింకూ సింగ్‌ను కూడా తన ట్రాప్‌లో పడేసి వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్లు ఆడే రింకూకి ఓ ఊరించే బంతి వేసిన నూర్ అహ్మద్, బౌండరీ దగ్గర దొరికేలా చేశాడు. దాంతో నూర్ అహ్మద్ వెంటవెంట ఓవర్లలోనే రహానే, గ్రీన్, రింకూ సింగ్‌ని అవుట్ చేసి ఒక్కసారిగా మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. నూర్‌కి తోడు అకేలా హోసెన్ కూడా రాణించడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సీఎస్కే 32 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వికెట్లు తీసిన నూర్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ భారీ విజయంతో సీఎస్కే జట్టు తమ పాయింట్ల పట్టికలో ఒక స్థానానికి ఎగబాకి ఎనిమిదో స్థానానికి వెళ్లింది.