తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. 43 డిగ్రీలు దాటిన ఎండలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండలు ఇలా ఉంటే మే నెల పరిస్థితి ఏంటని ప్రజలు భయపడిపోతున్నారు. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 14) నాటి వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండగా.. మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రావాలంటే బెంబేలెత్తాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లి మండలంలో అత్యధికంగా 43.5 నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ తర్వాత నిర్మల్ 43.3 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ 43.3, ఆదిలాబాద్ 43.2, సిద్దిపేట 42.9, కామారెడ్డి 42.8, కరీంనగర్ 42.8, మంచిర్యాల 42.8, సిరిసిల్ల 42.8, సంగారెడ్డి 42.8, గద్వాల 42.7, ఆసిఫాబాద్ 42.7, నాగర్ కర్నూల్ 42.7, పెద్దపల్లిలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు చెప్పారు. మరో ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దయచేసి బయటకు రావొద్దు: మంత్రి సీతక్క గత కొద్దిరోజులుగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన ఎండలు ఉంటున్న నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి రావొద్దని కోరారు. 'ప్రజలందరూ ఉదయం 6 నుండి 10 గంటల వరకు మీ మీ పనులను ముగించుకుని ఇంటివద్దే ఉండడం శ్రేయస్కరం. తప్పని పరిస్థితులలో బయటికి వచ్చినట్లయితే.. తల మీద టోపీ, లేదా టవల్, లేదా మరేదైనా వస్త్రాలు ఉపయోగించడం అవసరం, సురక్షితం కూడా. ఈ విధమైన చర్యలు తీసుకొనట్లైతే ఎండదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎండదెబ్బ తగిలి అస్వస్థతలకు గుర్తవుతున్నారు. ఈ మధ్య మేం గ్రామాలలో పర్యటించినప్పుడు కూడా ఈ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఎండదెబ్బకి ఎవరు కూడా గురికాకూడదు.. అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా పంచాయత్ రాజ్ శాఖ నుంచి మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల కేంద్రాలలో చలివేంద్రాలు పెట్టి గ్రామాలలో కాని పట్టణాలకు కానీ వచ్చే వారికి మంచి నీరు అందించే లక్ష్యంతో మా పంచాయత్ రాజ్ కమీషనర్ ద్వారా జిల్లా పంచాయతి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.' అని సీతక్క వెల్లడించారు.