లీటర్ పెట్రోల్‌‌పై‌ రూ.18, డీజిల్‌పై రూ.35 లాస్.. ప్రభుత్వ చమురు కంపెనీలకు భారీ నష్టం!

Wait 5 sec.

Petrol Price: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లకు పైగా చేరినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడంతో ఈ నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ. 18, లీటర్ డీజిల్‌పై రూ. 35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దశాబ్దం కంపెనీలైన ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్ సంస్థలు 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగానే కొనసాగిస్తూ వస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. ఆ తర్వాత 60 డాలర్ల స్థాయికి దిగవచ్చింది. తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఓ దశలో బ్యారెల్ చమురు 120 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో 3 చమురు కంపెనీలు కలిపి రోజుకు రూ. 2400 కోట్ల మేర నష్టాలను భరించాల్సి వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ప్రభుత్వం మధ్యలో జోక్యం చేసుకోవడంతో కొంత మేర ఊరట లభించినట్లు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్స్చైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ఆయిల్ కంపెనీల నష్టం రోజుకు రూ. 1600 కోట్లకు దిగివచ్చింది. దీంతో జనవరి- మార్చి త్రైమాసికంలో నష్టాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 135 నుంచి 165 డాలర్లకు చేరితే లీటర్ పెట్రోల్ పై రూ. 18, లీటర్ డీజిల్ పై రూ. 35 చొప్పున నష్టాలు వస్తాయని మాక్వరీ గ్రూప్ పేర్కొంది. ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.6 చొప్పున నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాక పెట్రోల్ ధరలు పెంచే అవకాశం ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్లు ఎలాంటి వాదనలు వినిపించడం లేదు. ఏదేమైనా ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.