కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసే వారిని తాము వదిలిపెట్టమని.. కాంగ్రెస్ నేత, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం రోజున మంథనిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలోనే తీవ్ర హెచ్చరికలు చేశారు. మంథనిలో ప్రతీ రోజు ఉండకపోవచ్చని.. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరైనా బెదిరించినా.. ఏమైనా జరిగినా.. తాము 2 గంటల్లోనే వస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వారిని అడ్డంగా నరుకుతాం అంటూ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.. ఇలా బహిరంగంగా హెచ్చరికలు చేయడం పట్ల ప్రతిపక్షాలతోపాటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా మంది బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తాజాగా నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో హస్తం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలో ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేశారని క్లారిటీ ఇచ్చారు. మంథనిలో నిర్వహించిన సమావేశంలో భాగంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలు.. తమ కష్టాలు, బాధలు చెప్పినప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆ విధంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఎవరైనా శాంతికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా.. అలాంటి చర్యలు చేపట్టినా తాము కచ్చికంగా ఖండిస్తామని తేల్చి చెప్పారు.