సిమెంట్, స్టీల్, ఇసుక లేకుండానే.. పాత పద్ధతిలో మోడ్రన్ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు.. ఆర్కిటెక్ట్ అద్భుతం..

Wait 5 sec.

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనేది పెద్దల సామెత. ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా బోలెడు తతంగం ఉంటుందనేది దాని ఉద్దేశం. పెళ్లి సంగతి పక్కనబెడితే.. ఇల్లు కట్టాలంటే మాత్రం చాలా కావాల్సి ఉంటుంది. మనం కోరుకున్న రీతిలో, మనకు నచ్చిన విధంగా, పర్యావరణహితంగా ఇల్లు కట్టడమంటే చిన్నపాటి యజ్ఞం చేసినట్టే. ఇక ఇల్లు కట్టాలంటే ఇసుక, సిమెంట్, కంకర, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రి, వాటికి అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుంటుంది. అయితే ఇవేవీ లేకుండానే పాతకాలం నాటి పద్ధతులు ఉపయోగించి అధునాతనమైన , అందమైన కట్టొచ్చని చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి అనే ఆర్కిటెక్ట్. ఈ విధానంలో ఆయన ఇల్లు నిర్మించారు.స్కాట్లాండ్‌లో తన చదువు పూర్తి చేసిన కరుణాకర్ రెడ్డి.. పర్యావరణ అనుకూల ఇళ్లను నిర్మించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో.. కంకర, సిమెంట్, స్టీల్, ఇసుక వంటివి ఏవీ అవసరం లేకుండానే అందమైన పర్యావరణహిత ఇళ్లను నిర్మించవచ్చని నిరూపిస్తున్నారు. ఇల్లు కట్టే స్థలంలోని మట్టికి డంగు కలిపి.. ఈ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు నిర్మించారు కరుణాకర్ రెడ్డి. మరోవైపు పాతకాలంలో భవనాలు ఎలా నిర్మించేవారో అలాంటి విధానాన్ని ప్రస్తుత తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా సంప్రదాయ పద్ధతిలో ఎకో ఫ్రెండ్లీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. సాధారణంగా ఇళ్లు కట్టే విధానంలో ప్లాస్టింగ్ చేస్తుంటారని.. దీని వలన వేడి ఉత్పత్తి కావటమే కాకుండా, కార్బన్ డై యాక్సైడ్ విడుదల అవుతుందని ఈయన చెప్తున్నారు. అలాగే ఇసుక, ఇటుక, కంకర వంటివి కావాల్సి వస్తుందని.. దీంతో వనరులు తగ్గిపోతున్నాయన్నారు. ఇలాంటివి పెద్దగా అవసరం లేకుండానే మనకు ఉన్న స్థలంలోని మట్టిని ఉపయోగించి, మన చుట్టూ ఉన్న వాటితోనే ఇల్లు కట్టినట్లు చెప్తున్నారు. పాతకాలం నాటి విధానాన్ని రీడిజైన్ చేసి మూడున్నర నెలలో ఇల్లు కట్టినట్లు తెలిపారు.మరోవైపు ఈ విధానంలో ఇల్లు కట్టాలంటే ముందుగా ఇల్లు కట్టే స్థలంలోని మట్టిని, నేల స్వభావాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆ ఇంటిని రాయితో కట్టాలా లేక పూర్తిగా మట్టిగోడలు సరిపోతాయా అనేది నిర్ణయిస్తారు. ఇంటిని కట్టే స్థలంలోని నేల స్వభావాన్ని అనుసరించి, రాతితో కట్టాలా, పూర్తిగా మట్టిగోడలు నిర్మించాలా, ఎంత ఎత్తులో గోడలు కట్టాలనే విషయాలను డిజైన్ చేసుకుంటామని కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇంటి రూఫ్‌ నిర్మాణం విషయానికి వస్తే పాతకాలంలో మాదిరిగా దూలాలను ఏర్పాటు చేసి.. దానిపై డంగుతో కలిసి స్లాబ్ వేస్తామంటున్నారు. ఈ విధానంలో ఇల్లు కట్టడం ద్వారా సహజ వనరుల వినియోగాన్ని 70 శాతం వరకూ తగ్గించవచ్చంటున్నారు. ఈ విధానంలో సిమెంట్, ఇనుము బదులుగా సున్నం, మట్టి, కలప వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తారు. దీంతో ఈ ఇల్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయని.. మట్టి గోడలు సహజసిద్ధంగా వెంటిలేషన్ అందిస్తాయని అంటున్నారు.