మేడారంలో గాయపడిన బాలుడి కుటుంబానికి సీతక్క భరోసా.. తల్లికి ప్రభుత్వ ఉద్యోగం

Wait 5 sec.

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద ఘటనకు సంబంధించి బాధితులకు ఊరట లభించింది. పూజారి సిద్దబోయిన రాణా రమేష్ కుమారుడు యువిన్‌ (6) గత నెలలో గద్దెల ప్రాంగణంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటనపై మంత్రి సీతక్క అప్పట్లోనే స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడమే కాకుండా.. తక్షణ ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. శనివారం ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ టీఎస్ దివాకర్‌తో కలిసి యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువిన్‌కు జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే కాలు కోల్పోయిన బాలుడి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మంత్రి, కలెక్టర్ చూపిన ఈ చొరవ పట్ల గిరిజన పూజారులు, మేడారం ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో తక్షణమే స్పందించి హామీని నెరవేర్చిన మంత్రి సీతక్కకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.అసలేం జరిగిందంటే..?వనదేవతల పూజారి సిద్దబోయిన రాణా రమేష్ కుమారుడు జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పూజారి తన విధుల్లో నిమగ్నమై ఉండగా.. గద్దెల వద్ద నిర్మాణ పనుల కోసం ఉంచిన ఒక రాయిపై కూర్చున్న బాలుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దురదృష్టవశాత్తు పైనుంచి మరో భారీ శిల జారి అతడి రెండు కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాలుడిని వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు యువిన్‌కు పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడికాలు విరగడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. అయితే ఎడమకాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పాటు కణజాలం తీవ్రంగా దెబ్బతిని రక్తప్రసరణ నిలిచిపోయినట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి ప్రాణాలను కాపాడటం కోసం ఎడమ కాలును తొలగించడం తప్పనిసరి అని వైద్యులు నిర్ణయించారు. పరిస్థితి విషమించడంతో మడమ పైభాగం వరకు యువిన్ కాలును తొలగించారు. గద్దెల అభివృద్ధి పనుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడుకోవాల్సిన వయసులో చిన్నారి యువిన్ శాశ్వత వికలాంగుడిగా మారడం పూజారి కుటుంబంలో, మేడారం భక్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.