సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలే లక్ష్యంగా వల విసిరి, ప్రేమ పేరుతో వారిని వంచించి లక్షలాది రూపాయలు కాజేస్తున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23) సోషల్ మీడియా వేదికగా.. గత రెండేళ్లలో దాదాపు 20 మందికి పైగా బాలికలను నమ్మించి మోసగించినట్లు విచారణలో వెల్లడైంది.ప్రస్తుతం మియాపూర్‌లో నివసిస్తున్న ఆజాద్.. జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లోని ఇళ్లపై నిఘా పెట్టేవాడు. అక్కడి వాచ్‌మెన్లు, తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లలోని మైనర్ బాలికలు, యువతుల వివరాలు సేకరించేవాడు. ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తాను ఖరీదైన కార్లు, పబ్బుల్లో దిగిన ఫోటోలను పంపి తనకు తాను పెద్ద ధనవంతుడినని నమ్మించేవాడు. వారిని ప్రేమలోకి దించి ఆ తర్వాత ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు.ఇటీవల జూబ్లీహిల్స్‌లో నివసించే ఓ 15 ఏళ్ల బాలికను అర్జున్ అనే మారు పేరుతో పరిచయం చేసుకున్న ఆజాద్.. ఆమెను లోబరుచుకున్నాడు. గతంలోనే ఇతనిపై పోక్సో కేసు నమోదైనా.. జైలు నుంచి వచ్చాక మళ్లీ అదే బాలికను వేధించడం మొదలుపెట్టాడు. నిందితుడి బెదిరింపులకు భయపడి ఆ బాలిక తన ఇంట్లో ఉన్న రూ. 29 లక్షల నగదును చోరీ చేసింది. ఇందులో ఆజాద్‌కు రూ. 13 లక్షలు ఇవ్వగా.. ఈ విషయం తెలిసి బ్లాక్‌మెయిల్ చేసిన ఆ ఇంటి కారు డ్రైవర్‌ భార్యకు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.కేవలం మైనర్లనే కాకుండా.. నార్సింగి ప్రాంతానికి చెందిన ఓ యువతిని కూడా ఆజాద్ వంచించాడు. గుంటూరులో కాలేజీలో చేర్పించే నెపంతో ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత వారు ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బెదిరించి ఆమె నుంచి బంగారు గొలుసును కాజేశాడు. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆజాద్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి ప్రవర్తనలో ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే ఆరా తీయాలని చెబుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చాలా మంది కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.