దేశంలో సైబర్ నేరాలను అరికట్టడంలో .. కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు దేశ, విదేశాలకు చెందిన సైబర్ నేరగాళ్ల ముఠాను మట్టికరిపించిన పోలీసులు.. తాజాగా మరో కీలక ఆపరేషన్ చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు.. ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.0 పేరుతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ సైబర్ పోలీసులు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు చేసి.. నిందితులను పట్టుకున్నారు. అమాయకులను మోసం చేసి.. వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్న సైబర్ ముఠా ఆటను కట్టించారు. తాజాగా 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ పోలీసుల జరిపిన సోదాల్లో బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మంది సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్‌ మోసాలు, పెట్టుబడి స్కామ్‌లు, డిజిటల్‌ అరెస్ట్ పేరుతో దేశంలోని చాలా మంది అమయ ప్రజలను బెదిరించి.. మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.. వారి నుంచి భారీగా డబ్బులు దోచుకున్నట్లు గుర్తించారు. అయితే ఈ సైబర్‌ ముఠాకు బ్యాంకు అధికారులు అండగా నిలుస్తున్నారని గుర్తించిన పోలీసులు.. ఆ దిశగా పక్క ప్లాన్ ప్రకారం ఈ ఆపరేషన్‌ నిర్వహించి.. ఇద్దర్నీ పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇక మొత్తం 52 మంది నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు ఉండటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. డబ్బులకు కక్కుర్తి పడి.. బ్యాంక్ ఉద్యోగులే.. సైబర్ నేరగాళ్లకు సహాయం చేస్తున్నారని గుర్తించారు. వీరితోపాటు 15 మంది మ్యూల్‌ అకౌంట్లు ఉన్నవారు.. ఐదుగురు మధ్యవర్తులను కూడా అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సైబర్ పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లతో కలిసి ఈ కుంభకోణానికి తెరతీసిన బ్యాంక్ అధికారులు.. అక్రమంగా వారికి అకౌంట్లు ఓపెన్ చేయించి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ ఆపరేషన్‌ ఆక్టోపస్-2.0లో 16 స్పెషల్ సైబర్ పోలీస్ టీమ్స్ పాల్గొన్నాయి. మరోవైపు.. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ బాధితుల డబ్బులను దారి మళ్లించేందుకు.. సైబర్ కేటుగాళ్లు ఏకంగా 350 బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్‌ కేసులతో ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధం ఉన్నట్లు గుర్తించి.. ఆ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ నిందితులు అంతా కలిసి ఏకంగా రూ.150 కోట్ల మేర భారీగా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.