తమిళనాడులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విరుదునగర్ జిల్లా కట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న బాణాసంచా పరిశ్రమలో అకస్మాత్తుగా పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కట్టనార్‌పట్టిలోని వనజ బాణాసంచా పరిశ్రమలో అదివారం ఈ భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బాణాసంచా పరిశ్రమలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి చాలా మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కంపించాయి. భారీ పేలుడు కారణంగా పరిశ్రమలోని ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.మరోవైపు ఆదివారం రోజు బాణాసంచా పరిశ్రమకు సెలవు రోజు అయినప్పటికీ.. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కార్మికులు విధులకు వచ్చినట్లు తెలిసింది. రసాయనాలు కలుపుతున్న సమయంలో పేలుడు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఒక గదిలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం విస్తరించాయి. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్టుమెంట్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పేలుడు కారణంగా మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయి భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిని విరుదునగర్ ఆస్పత్రికి తరలించారు.విరుదునగర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ సంతాపం మరోవైపు విరుదునగర్ బాణాసంచా పరిశ్రమలో పేలుడు ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్న స్టాలిన్.. సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.