తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గని తేజస్వీ సూర్య.. కేంద్రమంత్రి క్షమాపణలు

Wait 5 sec.

ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణను పార్లమెంటు వేదికగా అవమానిస్తుంటే.. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు వారించలేదని మండిపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వక్రీకరిస్తున్నాయని.. ఆయన తెలంగాణను కించపరచడం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై తేజస్వీ సూర్య మాత్రం వెనక్కి తగ్గకపోగా.. మాత్రం క్షమాపణలు చెప్పారు. ఇటీవల తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరందాజ్లే తాజాగా స్పందించారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు సరియైనవి కావని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాము బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఇబ్బందికి గురై ఉంటే.. తేజస్వీ సూర్య తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని శోభా కరందాజ్లే తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి పిక్ పాకెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటి కేసు పెట్టాలని కేంద్రమంత్రి నిలదీశారు. హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి.. లోక్‍సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోతే ప్రతిపక్ష ఇండియా కూటమి సంబరాలు చేసుకున్నారని.. వారి ఉద్దేశం భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విచ్చిన్నం చేయడమేనని మండిపడ్డారు.అయితే తెలంగాణ విభజనపై తాను సరిగానే మాట్లాడానని.. లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సమర్థించున్నారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడిన తేజస్వీ సూర్య.. తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.