లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ విధ్వంసం సృష్టించింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా ఆ తర్వాత , లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. బ్యాట్ తగిలితే బంతి బౌండరీ దాటిపోతుంది. పవర్ ప్లేలో కేవలం 63 పరుగులే చేసిన పంజాబ్ 9 ఓవర్లు ముగిసే సమయానికి వంద పరుగులు పూర్తి చేసింది. 12.1 ఓవర్లలోనే 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. ప్రియాన్షు, కాన్‌లీ అవుటైన తర్వాత స్కోర్ బోర్డు నెమ్మదించి 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్‌లోనే ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఒకానొక దశలో ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ ఇద్దరూ సెంచరీల మోత మోగిస్తారేమో అనిపించింది. అయితే ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో కూపర్ కాన్‌లీ అవుట్ చేయడం, ఆ తర్వాత ఓవర్‌లోనే ప్రియాన్షు ఆర్య బౌండరీ దగ్గర దొరికిపోవడంతో ఇద్దరిలో ఒక్కరు కూడా సెంచరీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఈ ఇద్దరు కలిసి ఏకంగా 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన పంజాబ్‌ ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను మొహమ్మద్ షమీ మొదటి ఓవర్‌లోనే డకౌట్ చేశాడు. మంచి ఆరంభం దక్కడంతో లక్నో ఈ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందనుకున్నారు. అయితే, ప్రియాన్షు ఆర్య - కూపర్ కాన్‌లీ లక్నో ఆశలను అడియాసలు చేశారు. ప్రియాన్షు ఆర్య 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కూపర్ కాన్‌లీ 35 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత రెచ్చిపోయి బ్యాటింగ్ ఆడారు. ఒకానొక దశలో ఈ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేస్తారా అనిపించింది. కానీ కాన్‌లీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులు చేసి అవుటవ్వగా, ప్రియాన్షు ఆర్య 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. జట్టు స్కోర్ 187 పరుగుల వద్ద ఈ ఇద్దరూ అవుటవ్వడంతో పంజాబ్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. స్కోర్ బోర్డు నెమ్మదించడంతో పాటు సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ కూడా 6 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. నేహాల్ వధేరా 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు. ఇక ఆఖర్లో మార్కస్ స్టాయినీస్ 29, శశాంక్ సింగ్ 17 రన్స్ చేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.