కవితకు కొత్త జోష్.. పార్టీ పెట్టకముందే క్యూ కడుతున్న నేతలు.. జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే

Wait 5 sec.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు .. తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఈనెల 25వ తేదీన తన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన కవిత.. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇప్పటికే కాశీ, అయోధ్య పర్యటన పూర్తి చేసుకున్న కవిత.. కొత్త పార్టీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను పెట్టనున్న పార్టీలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, మాజీ మావోయిస్టులు, యువత, మేధావులకు ఇప్పటికే కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నేత రాథోడ్ బాపూరావు కవిత పార్టీలో చేరారు. ఆదివారం నాడు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో.. జాగృతి కండువా కప్పి కవిత తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన కవిత.. రాష్ట్ర సాధన కోసం పని చేసిన నేతలంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న పార్టీలను వదిలేసి.. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగనున్న జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానన్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ జాగృతి నుంచే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్‌లో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసిన కవిత.. ఇప్పుడు తిరిగి జాగృతిలోకి వచ్చినట్లు తెలిపారు. తాను పెట్టనున్న కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్త పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదరణ ఉంటుందని వెల్లడించారు.తెలంగాణకు కవిత ముఖ్యమంత్రి కావాలని రాథోడ్ బాపూరావు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడానికి కవిత ఇచ్చిన ధైర్యమే కారణమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వచ్చిన వారు కూడా మంత్రులు అయ్యారని.. కానీ తాను 2 సార్లు గెలిచినా మూడోసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.మరోవైపు.. సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నేతలు జాగృతిలో చేరినట్లు కవిత తెలిపారు. మరోవైపు.. ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్పీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే లింగయ్య దొర కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్‌ను పెట్టలేదని.. దీంతో ఆదివాసీలు తామ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదని లింగయ్య దొర ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని.. ఆదివాసీల కోసం జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. అదే సమయంలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఆదివాసీల భాష కోయతూర్‌ను చేర్చాలని కవిత డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న 12 కోట్ల మంది ఆదివాసీలు.. నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులు అని.. తమ కొత్త పార్టీలో ఆదివాసీల గౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు.