ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కి ఇవాళ చావో రేవో మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఆల్‌మోస్ట్ సగం సీజన్ ముగుస్తున్నా ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కమ్ బ్యాక్ ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఎంఐ.. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లు, బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్ ఇలా ఓడిపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో కూరుకుపోయారు. దాంతో గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌తో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇదే మొదటి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి, రెండు ఓడింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన గుజరాత్, వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే గెలిచి, వరుసగా నాలుగు ఓడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. హెడ్ టు హెడ్ రికార్డులలో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టే ఆధిక్యంలో ఉండటం ముంబై ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. ఐపీఎల్‌లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లలో తలపడితే గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ముంబై ఇండియన్స్ మూడింటిలోనే గెలిచింది. దాంతో ఈ మ్యాచ్‌లో గిల్ టీమ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ముంబై ఇండియన్స్ జట్టు అంచనార్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, తిలక్ వర్మ, మయాంక్ రావత్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్.