మిస్టరీ స్పిన్నర్ ఈజ్ బ్యాక్.. రాజస్థాన్‌కు స్పిన్ రుచి చూయించిన వరుణ్ చక్రవర్తి!

Wait 5 sec.

టీ20 వరల్డ్‌కప్‌లో ఆరంభమైన పతనానికి ఐపీఎల్‌తో తెరపడనుందా? టీ20 వరల్డ్‌కప్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి.. వికెట్లు తీసినా, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆరంభంలోనూ ఫామ్ కోల్పోయి వికెట్లు కూడా తీయలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ బౌలింగ్ చూస్తే మిస్టరీ స్పిన్నర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఈ సీజన్‌ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ వరుణ్ చక్రవర్తికి కనీసం ఒక్క వికెట్ కూడా దొరకలేదు. పైగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై‌పై 12 ఎకానమీతో 48 పరుగులు ఇవ్వగా, సన్‌రైజర్స్‌పై 15.5 ఎకానమీతో 2 ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నాడు. సీఎస్కేపై 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చాడు. కానీ హోం గ్రౌండ్ చెపాక్‌లో కూడా వికెట్ తీయలేకపోయాడు. వరుసగా తాను ఆడిన మూడు మ్యాచ్‌లలో వికెట్ తీయలేకపోవడం, భారీగా పరుగులు సమర్పించుకోవడంతో తనను తాను మార్చుకున్న వరుణ్ చక్రవర్తి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ నుంచి బౌలింగ్‌లో మార్పులు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో 8.5 ఎకానమీతో 34 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కీలక మ్యాచ్‌లో మాత్రం తన స్పిన్ మాయాాజాలంతో రాజస్థాన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే కాకుండా కేవలం 3.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో వరుణ్ చక్రవర్తితో పాటు కేకేఆర్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చింది. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో మోస్ట్ వికెట్ టేకర్ లిస్ట్‌లో ఎప్పుడూ టాప్ 5లో నిలిచే వరుణ్ చక్రవర్తి ఈసారి సగం సీజన్ ముగిసినా అట్టడుగులోనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కమ్ బ్యాక్ ఇస్తున్న వరుణ్.. లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఫుల్ ఫామ్‌లోకి వస్తాడని కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వరుణ్ వస్తుండటం విశేషం.