తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా.. రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నేడు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో సుమారు 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ. 5,653 కోట్లను కేటాయించింది. ఇప్పటికే మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో మొదటి విడతగా రూ. 3,590 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ సాయం వర్తించనుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ. 9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు విడతల వారీగా జమ అవుతాయి. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీ లోపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. లేదా తమ ఖాతా ఉన్న బ్యాంకులకు వెళ్లి వివరాలు ఆరా తీయవచ్చు. రెండో విడత పూర్తయిన వెంటనే, మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, సీఎం రేవంత్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనున్నారు. NDSA నిబంధనల ప్రకారం జరుగుతున్న పనుల వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు కాళేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. పర్యటన ముగింపులో కాటారం బహిరంగ సభ ద్వారా రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసి.. రాష్ట్రంలోని 45 లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నారు.