కాసుల పంట పండించిన రిలయన్స్, ఎల్ఐసీ, ఎస్బీఐ.. 8 కంపెనీలతో రూ. 1.87 లక్షల కోట్ల లాభం!

Wait 5 sec.

: ఏ మాత్రం అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. చాలా మంది నిర్లక్ష్యంతో ఇక్కడ అవగాహన లేకుండా డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ అంటేనే లాభాలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. కానీ స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ పెట్టుబడి అని చెప్పొచ్చు. ఇక్కడ ఆయా కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలు, ఫలితాలు, ప్రణాళికలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నీ గమనిస్తూ.. నిపుణుల సలహాతో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో భారీ స్థాయిలో పతనం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లకు భారీ స్థాయిలో నష్టాలు ఎదురయ్యాయి. అయితే కొద్ది రోజులుగా మాత్రం కోలుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గుతుండటం ఇందుకు దోహదం చేస్తుంది. ఇటీవల ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడం.. తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం జరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. . ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కాగా.. మిగతా 4 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 943 పాయింట్లు లేదా 1.21 శాతం పెరిగింది. నిఫ్టీ 303 పాయింట్లు లాభపడింది. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా భారత్‌లో టాప్- 10 కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రూ. 1,87,497.45 కోట్ల మేర పెరిగింది. ఇక్కడ భారతీ ఎయిర్‌టెల్ స్టాక్ అత్యధికంగా పుంజుకోగా.. ఇదే ఇన్వెస్టర్లకు అధిక లాభాల్ని అందించింది. కంపెనీల మార్కెట్ విలువనే.. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తుంటారు కాబట్టి.. ఆ మేరకు ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగిందని చెప్పొచ్చు. గత వారం ఎయిర్‌టెల్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 58,831.52 కోట్లు పెరగ్గా.. రూ. 11.25 లక్షల కోట్లకు చేరుకుంది. . ఇక అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యూ4 ఫలితాల తర్వాత పుంజుకుంటుండగా దీని విలువ రూ. 20,731 కోట్లు పెరిగి రూ. 9.34 లక్షల కోట్ల మార్కు వద్ద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,231 కోట్లు పెరగడంతో ప్రస్తుతం రూ. 18.47 లక్షల కోట్లుగా ఉంది. లార్సెన్ అండ్ టుబ్రో మార్కెట్ విలువ రూ. 18,577 కోట్లు పెరిగి రూ. 5.63 లక్షల కోట్లుగా ఉంది.ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 18,266 కోట్లు పెరిగి రూ. 9.65 లక్షల కోట్లుగా ఉంది. ఎస్బీఐ ఎం- క్యాప్ రూ. 12,599 కోట్లు పెరగడంతో ప్రస్తుతం రూ. 9.97 లక్షల కోట్ల వద్ద ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,650 కోట్లు పెరిగి ప్రస్తుతం రూ. 5.34 లక్షల కోట్ల వద్ద ఉంది. ఇదిలా ఉండగా.. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 16,163 కోట్లు తగ్గి ప్రస్తుతం రూ. 12.31 లక్షల కోట్లుగా ఉంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ. 9,769 కోట్లు పతనమై రూ. 5.64 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ.. మార్కెట్ విలువ పరంగా ప్రస్తుతం టాప్- 10 కంపెనీలుగా ఉన్నాయి.