ఏప్రిల్ నెల చివరకు వచ్చేశాం.. మరో వారం, పది రోజులలో ఈ నెల పూర్తవుతుంది. ఏప్రిల్ నెలాఖరు వచ్చిందంటే విద్యార్థులకు పండగే.. విద్యా సంవత్సరం పూర్తి అయ్యి.. వేసవి సెలవుల సీజన్ వస్తూ ఉండటంతో ఈ వారం రోజులు ఎప్పుడు పూర్తవుతాయా అని విద్యార్థులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు పూర్తయ్యేలోపు కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.కౌన్సిలింగ్ సెషన్లు ఎందుకు?సాధారణంగా వచ్చేసరికి విద్యార్థులు కాలువలు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవుల్లో ప్రమాదాల బారిన పడకుండా, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై విద్యార్థులకు పాఠశాలల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. స్కూళ్లు పూర్తికాకముందే ఈ కౌన్సిలింగ్ సెషన్లు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11వ తేదీ వరకూ మొత్తం 49 రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో సెలవుల్లో పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువులు, చెరువులు, నదుల సమీపానికి వెళ్లవద్దని విద్యార్థులను ఏపీ విద్యాశాఖ హెచ్చరించింది. తెలియని నీటి ప్రాంతాల్లో ఈతకు దిగవచ్చని సూచించింది. అలాగే ఏదైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతరులను రక్షించేందుకు సొంతంగా ప్రయత్నించకుండా చుట్టుపక్కల ఎవరైనా పెద్దలు ఉన్నారేమో గమనించి వారికి సమాచారం అందించాలని సూచించింది. మరోవైపు వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తేలికపాటి దుస్తులను ధరించటంతో పాటు తగినంత నీరు తాగాలని విద్యార్థులకు విద్యాశాఖ సూచించింది. ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది. వడ దెబ్బ లక్షణాలు, వాటి నివారణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని.. రోడ్డు భద్రత నియమాలను పాటించేలా వారిలో అవగాహన కల్పించాలని సూచించింది. ఫోన్ స్క్రీన్ టైమ్ తగ్గించి పుస్తక పఠనం, క్రీడలు వంటి ఉపయోగకరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని.. విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సూచనలు తెలియజేయాలని.. దీనిపై పర్యవేక్షణ ఉంచాలని డీఈవో, ఎంఈవోలను విద్యాశాఖ ఆదేశించింది.