ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పి, ఇబ్బందులు తప్పవా!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెకు దిగారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని.. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని.. గత నెల నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనుగుతుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మార్చి నెల పెండింగ్ జీతాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని.. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. కొన్ని చోట్ల నాలుగు నుంచి రెండు నెలలకు సంబంధించి జీతాలు పెండింగ్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మార్చి నెలకు సంబంధించిన జీతాలు డీసీఎం కార్యాలయంలో సాంకేతిక సమస్యతో ఆగిపోయాయని.. ఈ సమస్యపై ఇప్పటికే పురపాలకశాఖ మంత్రిని, అధికారుల్ని కలిసినా పరిష్కారం కాలేదంటున్నారు. అంతేకాదు కార్మిలకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. గతంలో పదవీ విరమణ చేసిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం.. అలాగే ఎవరైనా చనిపోతే దహన సంస్కార ఖర్చుల కోసం రూ.25వేలు.. అలాగే ఎవరైనా కార్మికుడు చనిపోతే.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటుగా నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయే అవకాశం ఉంది అంటున్నారు. చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ వంటి సేవలు ఆగిపోతాయని చెబుతున్నారు.. తమను ప్రభుత్వం చర్చలకు పిలవాలని.. అలాగే ప్రతినెలా కార్మికులకు నిర్ణీత సమయంలోనే జీతాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతుతున్నారు. ఈ మేరకు జీతాలతో పెంచడంతో పాటుగా మిగిలిన డిమాండ్‌లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని కార్మికులు చెబుతున్నారు. మొత్తం మీద మున్సిపల్ కార్మికుల సమ్మెతో మరో తలనొప్పి మొదలైంది. పారిశుద్ధ్య పనులు నిలిచిపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు.