తిరుమలలో శ్రీవారి బంగారం కోసం ఎగబడ్డ భక్తులు.. రెండు రోజుల్లో రికార్డుస్థాయిలో అమ్మకాలు

Wait 5 sec.

అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా తిరుమలలో రికార్డు స్థాయిలో బంగారు నాణేలు విక్రయాలు జరిగాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కౌంటర్‌లో భక్తులు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఆదివారం రోజు ఏకంగా రూ.70 లక్షలు, సోమవారం రూ.40 లక్షల విలువైన డాలర్లను భక్తులు కొనుగోలు చేశారు. గతేడాది అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు రూ.90 లక్షల విలువైన డాలర్లను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది అంతకుమించి కొనుగోళ్లు జరిగాయి. అది కూడా బంగారం ధరలు భారీగా పెరిగినా సరే భక్తులు బంగారు నాణేలను కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ గడియలు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉండటంతో భక్తులు నాణేలను కొనుగోలు చేశారు. శ్రీవారి ముద్ర ఉన్న నాణేలను కొనుగోలు చేయడం శుభప్రదమని భావించిన భక్తులు టీటీడీ విక్రయశాలలకు క్యూ కట్టారు. అలాగే వెండి, రాగి డాలర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల బంగారం ధరల్లో మార్పులు చేయడంతో టీటీడీ కూడా నిబంధనల్ని మార్చాల్సి వచ్చింది. తిరుమలలో విక్రయించే బంగారు డాలర్ల ధరలు వారానికి ఒకసారి మార్చేవారు. ప్రస్తుతం బంగారం ధరలు రోజూవారీ మారుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీకి నష్టం వస్తోంది.. అందుకే టీటీడీ అందుకు తగిన విధంగా మార్పులు చేశారు. మరోవైప తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వైకెడి మల్లికార్జునరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యుల పేరుతో రూ.కోటి విరాళం అందజేశారు. అందులో టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీలను అందజేశారు.