అసలైన ఆటేంటో గుజరాత్ టైటాన్స్ మీద చూయించింది. రీ సౌండ్ వచ్చే కమ్ బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాన్ స్టాప్ డామినేషన్ చేసింది. ముఖ్యంగా 22 బంతులకు కేవలం 19 పరుగులు చేసిన తిలక్.. 45 బంతుల్లో సెంచరీ చేశాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోర్ 103/4. క్రీజులో కెప్టెన్ 3 (5), 19 (22) ఉన్నారు. ఆఖరి ఆరు ఓవర్లు మహా అయితే ఇంకో అరవై పరుగులు చేస్తారని అందరూ భావించారు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా తిలక్‌ను మోటివేట్ చేశాడు. అగ్రెసివ్‌గా నువ్వో ఛాంపియన్ బ్యాటర్‌వి అంటూ తిలక్‌‌‌కి ఓ రేంజ్ మోటివేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి సీన్ మొత్తం మారిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్‌లో హిట్టింగ్ మొదలు పెట్టిన తిలక్ వర్మ 20 ఓవర్ ఆఖరి బంతి వరకూ కొడుతూనే ఉన్నాడు. 15వ ఓవర్‌లో 19 పరుగులు రాగా, 16వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. కగిసో రబడా వేసిన ఆ ఓవర్‌లో స్ట్రయికింగ్‌లో ఉన్న హార్దిక్ మొదటి ఐదు బంతుల్లో మూడు పరుగులే తీశాడు. 17వ ఓవర్‌లో తిలక్ వర్మ మరోసారి తన బ్యాట్‌కి పని చెప్పి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 15 పరుగులు రాబట్టాడు. స్పీడ్ స్టార్ అశోక్ శర్మ 18వ ఓవర్‌లో తిలక్ వర్మ ఉతికారేశాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు. సిరాజ్ 19వ ఓవర్‌లో పరుగులను కట్టడి చేయడమే కాకుండా కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా అవుట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో పూర్తి స్ట్రయికింగ్ తీసుకున్న ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 పరుగులు బాదాడు. ఆఖరి బంతికి బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 199/5 పరుగులు చేసింది. అందులో 101 పరుగులు తిలక్ వర్మవే కావడం విశేషం. తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేసిన తిలక్ వర్మ.. ఆఖరి 23 బంతుల్లో 82 పరుగులు బాదాడు. ఈ చివరి 23 బంతుల్లో తిలక్ వర్మ ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం బౌండరీల రూపంలోనే 74 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో సంజూ శాంసన్ తొలి సెంచరీ నమోదు చేయగా, ఇది రెండో శతకం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై 199/5 పరుగులు చేయగా.. గుజరాత్ 100 పరుగులకే ఆలౌట్ అయింది.