ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు వరాలు కురిపించింది. రాష్ట్రంలో పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు రుణం.. పశువుల కోసం రాష్ట్రంలో పశువసతి గృహాలు ఏర్పాటు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు పెంచే పశు పోషకులకు చేయూతను ఇచ్చేందుకు పశుకిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సొంత భూమి, కౌలు భూమి ఉన్న పాడి రైతులకు, డ్వాక్రా సంఘాల సభ్యులు పశుకిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అర్హులని తెలిపారు. బ్యాంకు నియమ నిబంధనలు అనుసరించి పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీకత్తు లేకుండా గరిష్టంగా రూ.3 లక్షల వరకూ రుణసదుపాయం పశుపోషకులు తీసుకోవచ్చని తెలిపారు. రుణం తీసుకోవాలనుకునే పశుపోషకులు దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి పశుకిసాన్ క్రెడిట్ కార్డు నమూనా దరఖాస్తు ఫారం పూర్తి చేయాలన్నారు దామోదర్ నాయుడు. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పశువుల వివరాలు, పాస్ పోర్టు ఫోటో, పశువైద్యాధికారి సర్టిఫికెట్‌తో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. రుణ సదుపాయం పొందిన రైతులు పశువుల దాణా కొనుగోలు, మెరుగైన పశువుల యాజమాన్యం వంటివి అందించడానికి ఎక్కువ వీలు ఉంటుందన్నారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేవలం 7 శాతం వడ్డీతో రుణం తీసుకోవచ్చన్నారు. ఏడాదిలోపు తీసుకున్న లోన్ తిరిగి చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ పొందవచ్చని.. కేవలం 4శాతం వడ్డీ కడితే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలోని పాడి రైతులు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి అందిస్తున్న పశుకిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం తీసుకోవచ్చన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించి.. జిల్లాకు ఐదు చొప్పున నియోజకవర్గాల కేంద్రాలకు సమీపంలో పశువసతి గృహాలను నిర్మించనున్నట్లు తెలిపారు దామోదర్ నాయుడు. పశువసతి గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ ద్వారా కేటాయిస్తామన్నారు. నిర్మాణ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుందని చెప్పారు. పశువులకు వైద్య సేవలు అందించే బాధ్యత పశుసంవర్ధక శాఖ చేస్తుందని వసతి గృహాల రోజువారీ నిర్వహణను స్వయం సహాయక సంఘాలు చేపడతాయన్నారు. ఒక్కొక్క పశువసతి గృహంలో 20 నుండి 25 పెద్ద పశువులకు నివాస సౌకర్యం కల్పిస్తామన్నారు. మిగిలిన స్థలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు.. పశువులకు త్రాగునీరు ఏర్పాటు చేస్తారన్నారు. ఒక్కో వసతి గృహం నిర్మాణానికి రూ. 10 లక్షలు అంచనా వ్యయం చేశామని అరెకరం స్థలం కేటాయించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో నిర్ణీత లక్ష్యం మేరకు 2027 మార్చి 31వ తేదీ నాటికి పశువసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.