తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న అధికారికంగా టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య, సైట్ ఇంజినీర్ తేజారెడ్డి సోమవారం (ఏప్రిల్ 20) లాంఛనంగా ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ.. తాజాగా పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా టోల్ రుసుములను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి ఖమ్మం నుంచి 116 కిలోమీటర్ల మేర రహదారి అందుబాటులోకి రాగా, ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలను నిర్దేశించారు. ఈ హైవే నిర్మాణ పనులు ఇంకా కొన్ని చోట్ల తుది దశలో ఉన్నాయి. తల్లంపాడు, వెంకటగిరి క్రాస్‌రోడ్డు, ధంసలాపురం మరియు దేవరపల్లి వద్ద పనులు పూర్తయిన తర్వాత ఆయా ప్లాజాలను కూడా దీనికి జత చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ఈ రహదారి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గడం. ప్రస్తుతం విజయవాడ మీదుగా వెళ్లే ప్రయాణికులు సుమారు 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. ఈ కొత్త కారిడార్ వల్ల దూరం 80 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ప్రస్తుతం నాలుగు లైన్ల రహదారిగా నిర్మించిన దీనిని.. భవిష్యత్తు అవసరాల కోసం ఆరు లైన్లకు విస్తరించుకునేలా డిజైన్ చేశారు. భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేశారు.స్మార్ట్ హైవేగా దీన్ని నిర్మించారు. హైవేపై ఏఐ ఆధారిత సీసీ కెమెరాల నిఘా, సోలార్ వీధి దీపాలు, అత్యవసర సహాయం కోసం 1033 హెల్ప్‌లైన్ నంబర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, ప్రతి 5 కిలోమీటర్లకు అత్యవసర మీడియన్ ఓపెనింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 10 ప్రధాన వంతెనలు, 98 అండర్ పాసులు, 295 కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఈ హైవే ఖమ్మం జిల్లా ఆర్థికాభివృద్ధికి కీలకపాత్ర పోషించనుంది. తల్లంపాడు వద్ద ఎగ్జిట్ సౌకర్యం కల్పించడం వల్ల స్థానిక రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే వీలుంటుంది. లాజిస్టిక్ హబ్‌లు, గిడ్డంగుల ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది.