ఆంధ్రప్రదేశ్‌ నిప్పులకొలిమిలా మారింది.. ఓ ఎండ, వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. కోస్తాతో పాటుగా రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఎండ, వేడిగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 46 మండలాల్లో వేడిగాలులు తీవ్రంగా వీస్తాయని.. 29 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని అంచనా వేశారు. బుధవారం 54 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 15 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది అన్నారు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం రోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీలు, కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రోజు ఏకంగా 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏపీలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి.. రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండకూడదు. అలాగే ఎండ తీవ్రతను గమనించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలు జాగ్రత్తగా ఉండాలని.. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా టోపీ, రుమాలు ధరించాలని తెలిపారు. ప్రజలు తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పొలాలు, ఆరు బయట పనిచేసే వారు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.