తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విద్యార్థులకు ఇంటర్ స్థాయిలోనే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. ఏసీఈ (Accounts, Commerce, Economics) అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జూన్‌లో ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, గురుకులాల్లో ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త కోర్సు రాకతో ప్రస్తుతం ఉన్న ఎంఈసీ గ్రూప్‌ ఇకపై కనుమరుగు కానుంది.కొత్త కోర్సు ప్రారంభం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో తరగతి గదులు, ఇతర వసతులపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల నుంచి వసతుల నివేదికలను సేకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 163 ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు కాలేజీల్లో కూడా ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులకు భిన్నంగా.. గణితం, సైన్సుతో సంబంధం లేకుండా విద్యార్థులకు త్వరితగతిన ఉపాధి లభించేలా ఈ 'ఏసీఈ'ని రూపొందించారు. గణితం కష్టంగా భావించే విద్యార్థులకు.. కామర్స్, ఎకనామిక్స్ రంగాల్లో రాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. ఏసీఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. డిగ్రీలో బీకాం, బీఏ వంటి కోర్సుల్లో నేరుగా చేరవచ్చు. సీఏ వంటి ప్రతిష్టాత్మక కోర్సులకు ఇది పునాదిగా మారుతుందని అంటున్నారు. బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్‌ రంగాల్లో వెంటనే ఉపాధి పొందవచ్చునని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఇప్పటికే ఎంఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు యథావిధిగా రెండో సంవత్సరం చదువుకోవచ్చని కొత్తగా చేరే వారికి మాత్రం ఏసీఈ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించి సత్తా చాటారు. త్వరలోనే సప్లమెంటరీ, ఇఫ్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.