తెలంగాణలో కిడ్నీ బాధితులకు ఊరట.. కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు

Wait 5 sec.

తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచనుంది.మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల నుంచి కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక కేంద్రం ఉండేలా ప్లాన్ చేస్తోంది. కొత్త డయాలసిస్ కేంద్రాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త డయాలసిస్ సెంటర్లను పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో) పద్ధతిలో ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఈ డయాలసిస్ కేంద్రాలకు హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు మెయిన్ హబ్‌లుగా ఉంటాయి. క్లినికల్‌ రివ్యూ, టెక్నికల్ గైడెన్స్ అందిస్తాయి. కొత్త డయాలసిస్ కేంద్రాలు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ వంటి మారుమూల ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 416 బెడ్‌లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఇలా ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 వరకు డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 79 డయాలసిస్ సెంటర్లను బోధనాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న 67 డయాలసిస్ సెంటర్లలో అదనంగా మరో 155 మెషిన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.కొత్తగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్లతో పాటుగా, బెడ్లు అదనంగా ఏర్పాటు చేస్తే రోగులు నిరీక్షణ సమయం తగ్గుతుందని, ఎమర్జెన్సీ కేసుల్లో త్వరగా వైద్యం అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు టీజీఎంఎస్ఐడీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలో డయాలసిస్ సెంటర్లు హబ్, స్పోక్‌ విధానంలో కొనసాగుతున్నాయి. మొత్తం మీద కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు ఊరట దక్కనుంది. అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేకుండా దగ్గరలోనే డయాలసిస్ చేయించుకోవచ్చు.