ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం డిస్మిస్ చేయడాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఏం తప్పుచేశారని వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించడమే కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన నేరమా అంటూ నిలదీశారు. చంద్రబాబు భయపడుతున్నారన్న జగన్.. దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కాకర్ల వెంకట్రామిరెడ్డి డిస్మిస్ అంశంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థమవుతోందన్న జగన్.. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారని.. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ సభలలో ఊదరగొట్టారని విమర్శించారు. ఇంటింటికీ బాండ్లు సైతం అందించి మోసం చేశారన్న జగన్.. కూటమి పాలనకు రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి అమలు చేయడం లేదన్నారు. సూప‌ర్ సిక్స్, సూప‌ర్ సెవెన్‌ అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారని..ఈ క్రమంలో ప్రజలు, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుక‌ల‌పై బ్రహ్మాస్తాలు ప్రయోగిస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటే ప్రభుత్వ పరిపాలన బాగాలేదని అర్థమన్న జగన్. హామీలను ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని అడ‌గ‌డమే తప్పా అని ప్రశ్నించారు. రెండేళ్లు పూర్తై, మూడో బ‌డ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్రశ్నించటం నేరమా అని నిలదీశారు. మూడున్నర లక్షల కోట్లకుపైగా చేసిన అప్పులు ఏమవుతున్నాయని నిల‌దీయ‌డం అపరాధమా? అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. "ప్రభుత్వ ఉద్యోగుల స‌మాఖ్య అధ్యక్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే అత‌నిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి డిస్మిస్ చేశారంటే మీరు భ‌య‌ప‌డిపోతున్నార‌నే క‌దా. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వ‌స్తూనే ఇస్తామ‌న్న ఐఆర్ ఇవ్వాలని అడ‌గ‌డంలో త‌ప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే క‌దా. ఉద్యోగుల విష‌యంలో మీరు వ్యవ‌హ‌రిస్తున్న తీరు, మీ మోస‌పూరిత వైఖ‌రిని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు." అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇక సీఐ శంకరయ్య విషయంలోనూ ఇలాగే వ్యవహరించారన్న జగన్.. ఏకంగా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటే భయపడుతున్నారని అర్థమని విమర్శించారు. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వాలంటీర్ల జీతాల రెట్టింపు వంటి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారి క‌డుపుకొట్టారని జగన్ ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హ‌యాంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు టీడీపీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారని.. అత‌న్ని ఎందుకు డిస్మిస్ చేయ‌లేదంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు భయపడుతున్నారని.. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతులకు భయపడుతున్నారని విమర్శిస్తూ జగన్ ట్వీట్ చేశారు.