తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో తాజాగా కీలక విచారణ జరిగింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదును 3 నెలల్లోగా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల నిధులతో రజత్ కుమార్.. తన కుమార్తె పెళ్లి జరిపారని.. అది నిబంధనలకు విరుద్ధమని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ దాఖలై ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాజాగా ఢిల్లీ హైకోర్టు స్పందించింది. గతంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ రజత్ కుమార్.. తన కుమార్తె వివాహాన్ని హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 5 రోజుల పాటు చాలా గ్రాండ్‌గా జరిగిందని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ పెళ్లి ఖర్చులను కొన్ని షెల్ కంపెనీల ద్వారా చెల్లించారని పిటిషనర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోంది.అయితే తాను మొదట డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ)కి ఫిర్యాదు చేసినట్లు గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆ ఫిర్యాదును తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి డీఓపీటీ పంపించింది. అయితే ఈ ఫిర్యాదుపై తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సీబీఐ విచారణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు గవినోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.ఐఏఎస్ రజత్ కుమార్ కుమార్తె వివాహం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మేఘా కృష్ణా రెడ్డికి సంబంధించిన షెల్ కంపెనీల ద్వారా జరిగిందని ఆరోపణలపై విచారణ జరపాలని తాను డీఓపీటీని కోరినట్లు పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌ను డీఓపీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అందుకే తాను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత కాలపరిమితిలోగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేసి 4 ఏళ్లు గడుస్తున్నా.. ఆరోపణలపై ఎలాంటి విచారణ లేదా దర్యాప్తు జరగలేదని పిటిషనర్ తరపు లాయర్ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు.