ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు రక్తం పంచుకున్న బంధం అంటే ప్రాణమిచ్చేంత అనుబంధం ఉండేది. కన్నతల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునేవారు. కానీ నేడు ఆస్తుల కోసం వారిని వీధుల పాలు చేస్తన్నారు.. కడుపున పుట్టిన బిడ్డలను సైతం కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. తాజాగా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలయముడై చంపేందుకు ఓ తండ్రి కుట్ర పన్నడం తీవ్ర కలకలం రేపింది. రెండో భార్యతో కలిసి ఇద్దరు పసిపిల్లలను విషం పెట్టి హతమార్చాలని చూసిన ఈ ఉదంతం రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బటి తండాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ అనే వ్యక్తికి 2016లో అనిత మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కుటుంబంలో మనస్పర్థలు రావడంతో శ్రీనివాస్ ఏడాది క్రితం మమత అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య అనిత పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి రాజీకి వచ్చినప్పటికీ.. ఆస్తి విషయంలో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజీ ప్రకారం పిల్లల పేరిట అర ఎకరం భూమి, కొంత నగదు ఇవ్వాలని పెద్దలు తీర్పు ఇచ్చారు.పిల్లల పేరిట రాసిన ఆ అర ఎకరం భూమి కూడా తమకే దక్కాలనే దురాశతో శ్రీనివాస్, అతని రెండో భార్య మమత దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని సంప్రదించి విషం కలిపిన బిస్కెట్లను పిల్లలకు తినిపించాలని అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపారు. మొదట నిందితుల ఆఫర్‌కు అంగీకరించిన సదరు వ్యక్తి.. తర్వాత పిల్లలను చంపాలనే ఆలోచనతో భయపడ్డాడు. నేరుగా పిల్లల తల్లి అనిత దగ్గరకు వెళ్లి శ్రీనివాస్ పన్నిన కుట్రను వివరించాడు. తన పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన అనిత వెంటనే పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో పిల్లలను చంపేందుకు ప్లాన్ చేశారని.., కుట్ర నిజమేనని తేలడంతో నిందితులు శ్రీనివాస్, అతని రెండో భార్య మమతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆస్తి కోసం కన్న పేగునే తెంచుకోవాలనుకున్న తండ్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.