ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. బస్సులు బంద్, అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్

Wait 5 sec.

రాష్ట్రంలో బస్సు చక్రం అర్ధరాత్రి నుంచి ఆగిపోనుంది. సాయంత్రం నుంచి చర్చలు జరపగా.. అవి ఎట్టకేలకు విఫలంగానే ముగిశాయి. దీంతో టీజీఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ కమిటీ జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో.. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపు ఉదయం నుంచి రాష్ట్రంలోని వేలాది బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. తమ 32 ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హుటాహుటిన ముగ్గురు అధికారులతో కూడిన ఒక హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఫలితం రాలేదు. డిమాండ్లను నెరవేర్చకుండా మరికొంత కాలం కాలయాపన చేసేందుకే కమిటీ ఏర్పాటు చేశారని.. జేఏసీ ఛైర్మన్ ఈదూరు వెంకన్న, జేఏసీ నేత థామస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.అయితే కార్మికులు చెబుతున్న సమస్యలు, డిమాండ్లను పరిష్కరించేందుకు 4 వారాల సమయం కావాలని కమిటీ పేర్కొంది. కానీ అందుకు కార్మిక సంఘాల నేతలు నిరాకరించారు. ఇప్పుడు చెప్పిన సమస్యలు, లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కాదని.. గతం నుంచి చెబుతున్నవేనని వెల్లడించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము కోరుతున్నట్లు కార్మిక జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఆర్టీసీ సమ్మెను అదునుగా చేసుకుని.. ప్రైవేటు వాహనాలు, ఆటోలు భారీగా దోచుకునే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.