జగద్గిరిగుట్టలో పలు ఆలయాలన్నీ కలిసి ఉండే ప్రాంతంలో ఉన్న కోనేరు ఆక్రమణకు గురైంది. అందులో మట్టి పోసి వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆ ఆలయ పూజారి గత 22 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారి రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన .. అక్కడి ఆక్రమణలను తొలగించింది. కోనేరు పూడిక తీయించి.. దాన్ని పునరుద్ధరించింది. దీంతో ఆ ఆలయ పూజారి హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. తాను 22 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. జగద్గిరిగుట్టలో అనేక దేవాలయాలు ఒకే చోట కొలువై ఉండటం విశేషం. అయితే ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు (గుండం) కబ్జాకు గురి అవుతోందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి ఏడుస్తూ, వేడుకున్న వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. ఆ కోనేరును కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలోనే ఆ వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన .. జగద్గిరిగుట్ట ఆలయ కోనేరును పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున కోనేరులో ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. ఆ కోనేరులో పేరుకుపోయిన పూడికను తీసివేశారు. దాదాపు 26 ట్రక్కుల నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారాన్ని తొలగించేసి.. కోనేరుకు సరికొత్త రూపును తీసుకువచ్చారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న కోనేరును స్థానికులు ఆక్రమించేసి.. దాన్ని మట్టితో నింపారు. ఇక వాహనాల పార్కింగ్ కోసం వారు ఆ కోనేరు ఉన్న ప్రాంతాన్ని ఉపయోగించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే మొత్తం కోనేరునే కబ్జా చేయాలని స్థానికులు చేసిన ప్రయత్నాలకు హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. కోనేరులో పూడిక తీసిన హైడ్రా అధికారులు.. దాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. హైడ్రా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలయ పూజారి, భక్తులతోపాటు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. కబ్జాలను విడిపించడంలో హైడ్రా అధికారులు చేపడుతున్న చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా తన 22 ఏళ్ల పోరాటం ఇప్పుడు ఫలించిందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి వెల్లడించారు. కోనేరును చూడకుండానే తాను కన్నుమూస్తానేమో అని ఇన్నేళ్లూ భయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం హైడ్రా అధికారుల రూపంలో ఆ దేవుడే.. కోనేరు పరిరక్షణకు చర్యలను చేపట్టారని తెలిపారు. కబ్జాలను తొలగించిన హైడ్రా అధికారులకు.. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పూజారి ధన్యవాదాలు చెప్పారు. జగద్గిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమాన్ ఆలయం, జగద్గిరిగుట్ట గోవిందరాజుల స్వామి దేవాలయం, పోచమ్మ ఆలయం, శ్రీ వాసవి కనకపరమేశ్వరి ఆలయం, శ్రీ నల్ల పోచమ్మ ఆలయం, శివాలయం, పరశురామాలయం, అయ్యప్పస్వామి ఆలయం ఇలా చాలా మంది దేవ, దేవతలు కొలువై ఉండటం గమనార్హం.