ద్వారా దాదాపు ఏడాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం.. గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన ఉద్దేశించి కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం లభించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరోసారి కేసీఆర్.. ఇంకో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రజతోత్సవ సంబురాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 27వ తేదీన రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ కూలంకషంగా చర్చలు జరపనున్నారు. పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించడంతోపాటు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపైనా గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగానే పార్టీ భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు.. ఈ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్.. పార్టీలోని అన్ని స్థాయిల కీలక నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు.. కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్లు కూడా హాజరు కావాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్న వేళ.. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.