రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. ఏం చెప్తారోనని దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

Wait 5 sec.

శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు.. శుక్రవారం రాత్రి లోక్‌సభలో వీగిపోయిన మరుసటి రోజే ఈ ప్రసంగం ఏర్పాటు చేశారు. అయితే ఏ అంశంపై ఉంటుందనే దానిపై పీఎంఓ ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో.. అసలు ఏం జరగనుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.మరోవైపు.. నిన్న బిల్లు వీగిపోవడంతో.. కేంద్ర మంత్రివర్గం శనివారం ఉదయం సమావేశం అయింది. అయితే ఈ కేబినెట్ భేటీలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. వ్యక్తం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారకపోవడానికి కారణం విపక్షాలేనని.. అదే సమయంలో వారు చేసిన ఈ తప్పుకు భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర హెచ్చరికలు చేశారు. మహిళల పట్ల ప్రతిపక్షాలకు ప్రతికూల మనస్తత్వం ఉందనే విషయాన్ని దేశంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ విధానానికి సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో నెగ్గకపోవడం బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రతిపాదించిన ఈ బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా, వాడివేడిగా చర్చ జరగ్గా.. ఓటింగ్‌లో అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక రాజ్యాంగ సంస్కరణ బిల్లు పార్లమెంటులో విఫలం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక చివరిసారిగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి గతేడాది సెప్టెంబర్ 21వ తేదీన ప్రసంగించారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణల గురించి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం చేశారు. అయితే ఇవాళ జరపనున్న ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణను లేదా ఈ ఓటమిపై తన స్పందనను తెలియజేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలు ఇప్పుడు అనిశ్చితిలో పడటంతో ప్రధాని మోదీ చేసే ప్రసంగంలో ఏ ప్రకటన చేస్తారో అన్నది ఉత్కంఠగా మారింది.