కాసుల పంట పండించిన బంగారం.. గోల్డ్ బాండ్ ధరల ప్రకటన.. లక్షకు రూ. 3.20 లక్షలొచ్చాయ్!

Wait 5 sec.

: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ SGB 2020-21 సిరీస్ VII కు సంబంధించి ముందస్తు విమోచన ధరను (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) తాజాగా ప్రకటించింది. దీనిని 2020 అక్టోబర్ 20న ఇష్యూ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 20 నుంచి రిడీమ్ చేసుకోవచ్చని ప్రకటించింది. సాధారణంగా గోల్డ్ బాండ్లకు కాల పరిమితి 8 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఐదేళ్లు ముగిసిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు 2020-21 సిరీస్ VII ఇష్యూ చేసి ఐదేళ్లు దాటిన నేపథ్యంలో ముందస్తు విమోచన ధరల్ని ప్రకటించింది. ఏప్రిల 15, 16, 17 తేదీల సగటు బంగారం ధర ఆధారంగా ఈ ముందస్తు విమోచన ధరను ఆర్బీఐ ప్రకటించింది. ఇక్కడ ఒక్కో యూనిట్ లేదా గ్రాముకు ధరను రూ. 15,254 గా నిర్ణయించింది. ఇక ఇష్యూ ధర గ్రాముకు రూ. 5051 గా ఉండేది. ఆన్‌లైన్‌లో అప్లై చేసి.. డిజిటల్ రూపంలో పేమెంట్ చేసిన వారికి రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు గ్రాము ధర రూ. 5001 గా అయింది. ఈ లెక్కన చూస్తే ఒక గ్రాముకే రూ. 15,254- 5001= రూ. 10,253 లాభం వచ్చింది. అంటే గ్రాముపైనే రూ. 10,253 లాభం వస్తుందన్నమాట. ఇది శాతం పరంగా చూస్తే 205 శాతం రాబడి వస్తుంద. అంటే 2020లో ఈ స్కీంలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి చేరిన వారికి రూ. 3.05 లక్షలు వస్తాయన్నమాట.ఇక్కడ లెక్కలు చేసింది వడ్డీతో కాకుండానే. గోల్డ్ బాండ్లపై వార్షిక ప్రాతిపదికన ఆర్బీఐ 2.50 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాబడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. రూ. 1 లక్ష పెట్టుబడికి 2.50 శాతం వడ్డీ రేటు లెక్కన ఏటా వడ్డీ రూ. 2,500 వస్తుంది. ఇక 2020 నుంచి చూస్తే ఆరేళ్లలో వడ్డీ రూ. 2500x6= రూ. 15 వేలు వస్తుందని చెప్పొచ్చు. అప్పుడు మొత్తం చేతికి రూ. 3.20 లక్షలకుపైనే వస్తుందన్నమాట. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందన్న కారణంతో ఆర్బీఐ కొంత కాలంగా గోల్డ్ బాండ్లను జారీ చేయట్లేదు. అయితే వీటి టెన్యూర్ 8 ఏళ్లుగా ఉంటుంది కాబట్టి.. గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు డబ్బుల్ని చెల్లిస్తోంది.