తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మళ్లీ మొదలు కానుంది. గత , వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. తాజాగా.. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుండి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరించాలని అధికారులు ఆదేశించారు. ఈ డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు నివేదించాలని, ఆ తర్వాత ముసాయిదా జాబితాలను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.చివరిసారిగా 2019 మే నెలలో మూడు దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. గత ఏడాది జూన్‌తో ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వాస్తవానికి గతేడాది సెప్టెంబరులోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నెలకొన్న న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు అనుమతితో రిజర్వేషన్ల ఖరారు తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పట్టణీకరణ పెరగడంతో 2019తో పోలిస్తే స్థానాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు గ్రామ పంచాయతీలు పురపాలికల్లో విలీనం కావడంతో ఈసారి 44 ఎంపీటీసీలు, 4 జడ్పీటీసీ స్థానాలు తగ్గాయి.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అందించిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను పూర్తిగా పట్టణ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్‌ల సంఖ్య 31కి పరిమితమైంది. ఓటర్ల జాబితా ఖరారు కాగానే బ్యాలెట్ బాక్సుల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి పరిపాలనాపరమైన చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా.. ఇదే ఊపు కొనసాగించాలని హస్తం పార్టీ భావిస్తోంది. పార్టీ సింబల్‌పై జరిగే ఎన్నికలు కావటంతో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ సైతం వ్యూహాలకు పదును పెడుతోంది.