ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.. ఇవాళ, ఆదివారం రెండు విడతల్లో హజ్ యాత్రికు బయల్దేరి వెళ్లనున్నారు. అలాగే హజ్ యాత్రకు వెళ్లేవారికి తీపికబురు చెప్పింది.. ఈ ఏడాది కూడా సాయం అందిస్తోంది. విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లి వచ్చే వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తోంది హజ్ యాత్రకు వెళ్లేవారికి ఆర్థిక సాయం అందించేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6.40 కోట్లు మంజూరు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఇవాళ, ఆదివారం రెండు విడతల్లో 333 మంది హజ్‌ యాత్రకు వెళ్లనున్నారు. వెళ్లే వారంతా ఒకరోజు ముందుగానే వచ్చారు. వారందరికి గన్నవరం సమీపంలోని ఎస్‌ఎం కన్వెన్షన్‌ సెంటర్‌‌లో.. మైనారిటీ మంత్రిత్వ శాఖ, హజ్‌ కమిటీ వసతి, భోజనం ఏర్పాటు చేసింది. మైనార్టీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ నుంచి ఈ ఏడాది 2వేలమందికిపైగా హజ్‌ యాత్రకు వెళుతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి శనివారం (ఏప్రిల్ 18) తొలి విడతలో 156 మంది, 19న (ఆదివారం) రెండో విడతలో 177 మంది వెళ్తున్నట్లు తెలిపారు. మిగిలిన హజ్ యాత్రికులు హైదరాబాద్‌‌తో పాటుగా బెంగళూరు ఎంబార్కేషన్‌ కేంద్రాల నుంచి బయల్దేరి వెళతారని మంత్రి ఫరూక్ తెలిపారు.ఏపీ నుంచి ప్రతి ఏటా విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి హజ్‌ యాత్రకు ఎంతో మంది వెళుతున్నారు. ఈ మేరకుదరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తుంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారికి పాస్‌పోర్ట్ ఉండాలి.. అది కూడా హజ్ యాత్ర జరిగే ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. హజ్ యాత్ర కోసం.. అధికారిక వెబ్‌సైట్ భారత హజ్ కమిటీ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆధార్, పాస్‌పోర్ట్, ఫోటో, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏపీ ప్రభుత్వం రూ.లక్ష సాయాన్ని హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది.