శ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. గ్యాస్ బుకింగ్, డెలివరీ చేయడానికి సమయం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది.. రాష్ట్రంలో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఐదు చోట్ల పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లలో వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తారు.. ఈ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు సరఫరా చేయనున్నారు. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.రాష్ట్రంలో ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.59.63 కోట్లు ఖర్చు అవుతుంది.. ఇందులో రూ.12.50 కోట్లు కేంద్రం గ్రాంట్‌గా.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.8.30 కోట్లు సమకూర్చనుంది. ఇక ఈ ఐదుచోట్ల మున్సిపల్ కార్పొరేషన్లు రూ.17 కోట్లు అందిస్తాయి. ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రైవేట్‌ సంస్థలు మిగిలిన రూ.21.83 కోట్లను చేయనున్నాయి. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. రాష్ట్రంలో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాల్లో ఇదో కీలక ముందడుగని చెబుతున్నారు.ఈ ఐదు కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌లకు రోజుకు 25 టన్నుల వరకు వ్యర్థాలు కావాలి.. మొత్తం ఐదు ప్లాంట్లకు కలిపి 125 టన్నుల వ్యర్థాలు ఉండాలి. ఆయా నగరాల్లో ఉండే హోటల్స్, మార్కెట్‌లు, హాస్టల్స్, కమ్యూనిటీ హాల్స్, టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ల నుంచి ఫుడ్, కూరగాయల వ్యర్థాలను ప్లాంట్లకు తరలిస్తారు. టౌన్‌షిప్‌లు నిబంధనల ప్రకారం (ఘన వ్యర్థాల నిర్వహణ విధానం-2026) ప్రతిరోజూ వంద కిలోల పొడి వ్యర్థాలను ఎరువుల కింద తప్పనిసరిగా తయారు చేయాలి. ఒకవేళ అది కుదరని పక్షంలో ఈ వ్యర్థాలను కార్పొరేషన్లకు సరఫరా చేయాలి. అందుకే టౌన్‌షిప్‌ల నుంచి కూడా పొడి వ్యర్థాలు ప్లాంట్లకు తరలించాలని ప్లాన్ చేశారు. ఇలా ఐదు ఐదు కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల నుంచి 125 టన్నుల వ్యర్థాలతో ఐదు టన్నుల బయో గ్యాస్‌ ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను మొదటగా హోటళ్లకు అందిస్తారు.. ఆ తర్వాత ఇతర వాణిజ్య సంస్థలకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 132 ప్లాంట్లలో ప్రతిరోజూ 120 టన్నుల గ్యాస్‌ ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతానికి ఐదు ప్లాంట్‌లు ప్రారంభించి.. రాష్ట్రంలోనూ దశలవారీగా ఆ సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు రాబోయే రోజుల్లో ప్రైవేట్‌ ప్లాంట్లను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచన ద్వారా అటు నగరాల్లో వ్యర్థల సమస్యకు పరిష్కారం దొరుకుంది.. ఇటు గ్యాస్ కూడా లభిస్తుంది. డంపింగ్ యార్డ్‌లకు చెత్త తరలించే పరిస్థితులు రావంటున్నారు.