Tamil Nadu Elections 2026:స్నేహితుడి గెలుపు కోసం రంగంలోకి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇంతకీ ఎవరీ మునిరత్నం

Wait 5 sec.

తమిళనాడులో ఎన్నికల సందండి కనిపిస్తోంది.. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి కోసం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రంగంలోకి దిగారు. చిరకాల మిత్రుడి గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు వెళ్లి స్నేహితుడికి మద్దతు తెలిపారు.. తనవంతుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో శోలింగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. ఆయనతో జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది.. వీరిద్దరు మంచి స్నేహితులు, అలాగే ట్రావెల్స్ బిజినెస్ కూడా చేశారు. తన చిరకాల మిత్రుడు ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని AM మునిరత్నాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికను పరిశీలించారు. అలాగే పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు..ప్రస్తుతం ట్రావెల్స్ పరిస్థితుల గురించి చర్చించారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏఎం మునిరత్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు.. ఎన్నికల్లో ఆయన శోలింగర్ నుంచి పోటీచేస్తున్నారు. మునిరత్నం 1989 తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి శోలింగర్‌ నుంచి పోటీచేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.. 1991లోనూ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వీడి ఆయన తమిళ మాణిల కాంగ్రెస్ (TMC) అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2001లో ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు.. 2006లో కూడా పోటీచేయలేదు. అయితే టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. మునిరత్నం 2011 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2016 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయగా.. ఓటమి ఎదురైంది. 2021 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.