ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. గతంలో ఆర్టీసీలో ప్రతి నెలా ఎస్‌ఆర్‌బీఎస్‌ (స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌) కింద డబ్బులు చెల్లించిన ఉద్యోగులకు డబ్బులు విడుదల చేశారు. మొత్తం రూ.75 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఈ ఎస్‌ఆర్‌బీఎస్‌‌ను రద్దు చేశారు. కానీ ఉద్యోగుల వైపు నుంచి చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బుల్ని అందరికి పూర్తిగా ఇవ్వలేదు. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం వెంటనే స్పందించారు.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే ఈ డబ్బులు చెల్లించేందుకు అనుమతి వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.75 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. మొత్తం 8,500 మంది ఉద్యోగులకు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయగా.. ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చాయి. వీరంతా ఈ ఏడాది జూన్‌ నెల నుంచి 2030 మే వరకు పదవీ విరమణ పొందేవారు. ఏపీ ప్రభుత్వం ఎస్‌ఆర్‌బీఎస్‌ కింద ఉన్న పెండింగ్ నిధుల్ని చెల్లించడంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, ఆర్టీసీ ఎండీకి ఎంప్లాయిస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌ నేతలు ధన్యవాదాలు తెలిపారు. గతవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రూ.7,358 కోట్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. ఆ నిధుల్ని లభ్యతను బట్టి వరుసగా నిధులు విడుదల చేస్తున్నారు. వీరిలో ఆర్టీసీ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు. గతవారంలోపదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లించారు.ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల చేశారు.. ఈ డబ్బుల్ని రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అంతేకాదు సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపులు కూడా చేపట్టారు. ఇలా ఏపీ ప్రభుత్వం వరుసగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల్ని నిధుల లభ్యతను బట్టి విడుదల చేస్తోంది.మరోవైపు రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్ని చెల్లించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యమిస్తూ చర్యలు తీసుకున్నందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. అమరావతి సచివాలయంలో ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.