Mutual Funds : పెట్టుబడులు పెట్టేందుకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడి రాబట్టుకోవాలని ఎక్కువగా స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లవైపు చూస్తుంటారు. అయితే . దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ ఇస్తాయి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా.. మీ పెట్టుబడి స్థోమత, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి రాబడి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఈక్విటీ సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతానికి మించి రాబడి అందిస్తుంటాయి. అంతకంటే ఎక్కువ రావొచ్చు.. తక్కువా రావొచ్చు. ఇంకా ప్రస్తుత రోజుల్లో చాలా మంది మదుపరులు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ. కోటి సంపాదించాలని కలలు గంటుంటారు. ఇంత మొత్తం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని చెప్పొచ్చు. అయితే పదేళ్లలో రూ. కోటి అనేది అసాధ్యం మాత్రం కాదు. మంచి ప్లానింగ్, ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కొన్ని లెక్కల ద్వారా ఎంత ఇన్వెస్ట్ చేస్తే.. ఎంత శాతం అంచనా రాబడితో ఎన్నేళ్లకు ఎంతొస్తుందో తెలుసుకోవచ్చు. దీని కోసం ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మనం ముందుగా 12 శాతం అంచనా రాబడితో చూస్తే.. పదేళ్లలో రూ. కోటి లక్ష్యాన్ని చేరుకునేందుకు నెలకు రూ. 45 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇదే 14 శాతం రాబడి లెక్కన చూస్తే రూ. 41 వేల సిప్ సరిపోతుంది. రాబడి ఇంకాస్త ఎక్కువగా ఆశిస్తే 16 శాతంగా చూసుకుంటే గనుక అదే రూ. కోటిని పదేళ్లలో ఆర్జించేందుకు నెలకు రూ. 37 వేల చొప్పున సిప్ చేయాలి. ఇలా కాదు 10 శాతమే అంచనా రాబడి ఉంటే.. అప్పుడు రూ. 50 వేల సిప్ చేయాల్సి వస్తుంది. ఇలా రాబడి రేటు పెరిగితే.. చేయాల్సిన సిప్ పెట్టుబడి మొత్తం తగ్గుతుంది. ఒకవేళ ఈ సిప్ పెట్టుబడి మొత్తం మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అంటే.. ఇంకా తక్కువతోనూ పెట్టుబడిని ప్రారంభించొచ్చు. ఇక్కడ మళ్లీ మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఏటా సిప్ మొత్తాన్ని 5 లేదా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతే దీనికి మించిన రాబడి కూడా అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్ష్యాల్ని చేరుకోవడం సాధ్యమే అయినప్పటికీ.. ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్లాలి. ఓపిక చాలా అవసరం. ప్రతి నెలా ఇంత మొత్తం కేటాయించాలంటే క్రమం తప్పకుండా డబ్బుల్ని పొదుపు చేస్తుండాలి. ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇక రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే పోర్ట్‌ఫోలియో ఎలా నిర్మించుకోవాలనే దానిపైనా ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మార్కెట్ కంపెనీలతో సంబంధం లేకుండా టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో 50 శాతం వరకు ఇన్వెస్ట్ చేయాలని అంటున్నారు. స్వల్ప కాలంలో ఒడుదొడుకులు ఉన్నా లాంగ్ రన్‌లో మంచి వృద్ధిని అందించేందుకు అవకాశం ఉన్న మిడ్ క్యాప్ ఫండ్స్‌లో 25 శాతం, ఎక్కువ రిస్క్‌కు సిద్ధపడి, మార్కెట్ హెచ్చుతగ్గుల్ని తట్టుకోగలిగితే స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు 25 శాతం కేటాయించాలని చెబుతున్నారు.