ఆంధ్రప్రదేశ్‌ల సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరారజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం జిల్లాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీలు, ఆ తర్వాత కడప జిల్లా ఒంటిమిట్టలో ఏకంగా 44.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.ఓ వైపు ఎండ, మరోవైపు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం 12గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదంటున్నారు. ప్రజలు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగడంతో పాటుగా నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. ఎవరైనా అత్యవసరమై బయటకు వెళ్లాలనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు మరణాల నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలో పిడుగుపాటు మరణాలను తగ్గించే లక్ష్యంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, NRSC మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ మీద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, NRSC డిప్యూటీ డైరెక్టర్ డా అపర్ణ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో పిడుగులు పడే హాట్‌స్పాట్‌ల గుర్తించడం.. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ బలోపేతం చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాల నివారించొచ్చు అంటున్నారు.