ఆగని కేకేఆర్ ఓటముల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క గెలుపు కూడా లేని కేకేఆర్, మళ్లీ ఓడిపోయింది. కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టి సంకల్పంతో బరిలోకి దిగిన కోల్‌కతా గుజరాత్‌పై తేలిపోయింది. బౌలింగ్‌లో గట్టిపోటీ ఇచ్చి ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్‌ని తీసుకొచ్చింది. అయితే, చివరి ఓవర్‌లో గుజరాత్ విజయం సాధించడంతో కేకేఆర్ ఈ సీజన్‌లో ఐదో ఓటమిని ఎదుర్కొంది. ఈ విజయంతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి, బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకానొక దశలో 200కు పైగా స్కోర్ చేసేలా కనిపించిన కోల్‌కతా ఆఖరి ఐదు ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. హోం గ్రౌండ్‌లో ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. కెప్టెన్ బౌండరీల మోత మోగించగా, సాయి సుదర్శన్ కూడా ఫర్వాలేదు అనిపించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 16 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. పవర్ ప్లేలో గుజరాత్ 71 పరుగులు బాదేసింది. జోస్ బట్లర్ కూడా 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్‌కు వెళ్లగా, వాషింగ్టన్ సుందర్ 13 బంతుల్లో 13 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. సెంచరీకి అతి దగ్గర ఉన్న సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. 50 బంతులు ఆడిన గిల్ ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి ఐదు పరుగులు కావాల్సిన సమయంలో 16 బంతుల్లో 19 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ అవుటయ్యాడు. ఆ తర్వాత షారూఖ్ ఖాన్, తెవాటియా మ్యాచ్‌ని ముగించారు. తెవాటియా 7, షారూఖ్ 3 పరుగులు చేయడంతో 19.4 ఓవర్లలో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ అందుకుంది.